Jun 08,2023 06:44

సముద్రాన్ని చూసి ఆనందంతో కేరింతలు కొట్టేవాళ్లు చాలామందే ఉంటారు. అలలతో చెలిమి చేస్తూ రోజంతా అక్కడే గడిపేవాళ్లూ కనపడతారు. అయితే 'సముద్రాన్నే ఇల్లుగా చేసుకుని అక్కడే.. అందులోనే జీవిస్తున్నాను' అంటూ సముద్రంపై సముద్రమంత ప్రేమను పెంచుకున్నారు గోవాకు చెందిన కాట్యా కోయిల్హా. ఆమె ప్రేమకు సముద్రమే దాసోహమైంది. తనపై ఊయలాడిస్తూ ఎన్నో ఊసులు చెబుతోంది. వారిద్దరి స్నేహానికి చిహ్నంగా త్వరలో భారత్‌లోనే ఏకైక మహిళా విండ్‌ ఫాయిలర్‌గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.
భారత మొట్టమొదటి విండ్‌ సర్ఫర్‌గా కోయిల్హా 2014లో తొలిసారి యూత్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. దేశం తరపున పోటీపడిన ఏకైక, మొదటి సర్ఫర్‌ ఆమె. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఏషియన్‌ గేమ్స్‌లో విండ్‌ ఫాయిలర్‌గా పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. 2024లో జరగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత గేమ్‌గా దీన్ని పరిగణిస్తారు.

2
  • బాల్యంలోనే..

కోయిల్హా తండ్రి సర్ఫింగ్‌లో దిట్ట. మూడుసార్లు జాతీయ బహుమతులు అందుకున్నారు. ఆమె అన్న కూడా విండ్‌ సర్ఫరే. తండ్రిని, అన్నను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన కోయిల్హా చిన్నతనం నుండే సర్ఫింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. 11 ఏళ్లప్పుడు ఒకరోజు తండ్రితో పాటు సముద్రాన్ని చూసేందుకు వెళ్లింది. నీలి రంగులో ఎగిసిపడుతున్న అలలతో ఉన్న సముద్రాన్ని చూసి కేరింతలు కొట్టింది. తండ్రి ప్రాక్టీస్‌ను నిశితంగా గమనించింది. 'అలలపై నాన్న వేగంగా ప్రయాణించడం చూసి నా కళ్లు ఆశ్చర్యంతో మెరిశాయి. నేను కూడా సర్ఫింగ్‌ చేస్తానని మొండికేశాను. నా ఉత్సాహం చూసిన నాన్న సర్ఫింగ్‌ చేసేందుకు ప్రోత్సహించాడు. అయితే తొలిసారి పోల్‌పై నుంచొన్నప్పుడు చాలా భయమేసింది. కెరటాల గాలికి పడిపోతానేమోనని ఊగిపోతున్న బోర్డును గట్టిగా పట్టుకున్నాను. అయినా నా కాళ్లు చేతులు భయంతో వణికిపోయాయి. నరాలు బిగుసుకుపోయాయి. నాన్న ఇచ్చిన ధైర్యంతో ఆ రోజు సర్ఫింగ్‌ చేశాను.
అది మొదలు రోజూ నాన్నతో సర్ఫింగ్‌కు వెళ్లేదాన్ని. గాలితో పోరాడడం నేర్చుకున్నాను. వణుకు తగ్గించుకుని బలంగా నిలబడడం ప్రాక్టీస్‌ చేశాను. అలలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ బోర్డుపై ప్రయాణించడం మొదలుపెట్టాక ఇక ఆపలేదు' అంటూ తన మొదటి అనుభవాన్ని పంచుకున్నారు ఆమె. ఇంకా ఆమె ఇలా చెబుతున్నారు.. 'ఆ సమయంలో నేను, సముద్రం ఒక్కటే అన్నట్లుగా భావించాను. ఆ అనుభవం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది' అంటున్నారు.

3
  • ఇప్పటికీ ఆమే..

'సర్ఫర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటికి 12 ఏళ్లు గడుస్తోంది. అయినా ఏ ఒక్క మహిళా ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు. అందుకే నా ప్రయాణాన్ని చూసైనా నేను సాధించిన విజయాలను వినైనా నాతో పాటు మరింతమంది మహిళలు ఇటువైపు వస్తారని ఆశపడుతున్నాను' అంటున్న కోయిల్హా 2014 యూత్‌ ఒలింపిక్స్‌ తరువాత 2018లో ఏషియన్‌ గేమ్స్‌లో, 2022లో థారులాండ్‌లో జరిగిన అంతర్జాతీయ విండ్‌ సర్ఫింగ్‌ కప్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 8 మధ్య జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పాల్గొన్న ఆర్‌ఎస్‌ : ఎక్స్‌ కేటగిరీకి బదులుగా విండ్‌సర్ఫింగ్‌ క్లాస్‌ అయిన విండ్‌ ఫాయిలింగ్‌ విభాగంలో తొలిసారి పోటీపడుతున్నారు. ఒలింపిక్‌ కమిటీచే గుర్తింపుపొందిన ఈ విభాగాన్ని ప్రపంచ సైలింగ్‌ కమిటీ మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తోంది.

3
  • ఏ రెండు రోజులూ ఒకేలా ఉండవు..

'హాబీగా మొదలైన నా ప్రయాణం ఇప్పుడు ప్రొఫెషన్‌గా మారింది. ఇది నేను ఊహించలేదు. ఈ ఆట చాలా శక్తివంతమైనది. కెరటాలపై పట్టు సాధిస్తూ చేతులు, కాళ్లతో బోర్డు దిశ మార్చుకుంటూ వేగంగా ప్రయాణించడం అంత సులభం కాదు. ఆటలో నైపుణ్యం ఒక్కటే సరిపోదు.. పరికరాలను ఉపయోగించడంలో కూడా నైపుణ్యం సాధించాలి. సముద్రంపై ఏ రెండు రోజులూ ఒకేలా ఉండవు. సర్ఫింగ్‌ చేసేటప్పుడు ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2018లో సర్ఫింగ్‌ చేసేటప్పుడు నా బోర్డు నుండి ఓ యూనివర్శల్‌ భాగం విరిగిపడిపోయింది. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా నేను కిందకు పడిపోయాను. ఆ ప్రమాదంలో నా రెండు మోకాళ్లకు దెబ్బ తగిలింది. చాలా విరామం తరువాత మళ్లీ సర్ఫింగ్‌ చేయడం ప్రారంభించాను' అంటున్న కోయిల్హా ఈ ప్రయాణంలో మహిళల భాగస్వామ్యం లేకపోవడం వల్ల చాలాసార్లు పురుషుల విభాగంలోనే పోటీపడ్డారు. ఈసారి జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌ నుండైనా మహిళలు ఈ రంగంలోకి రావాలని ఆశిస్తున్నారు.