Jun 19,2023 09:20

రాజీబెన్‌ వంకర్‌కు చదువుకోవడం ఇష్టం. ఇంట్లో అధిక సంతానం కారణంగా ఆమె చదువు ఒకటో తరగతితో ముగిసింది. బాల్యంలో పెళ్లి ఆమె ఆశలను చంపుకునేలా చేసింది. ముగ్గురు పిల్లల తల్లిగా బాధ్యతల్లో ఉండగా... భర్త మరణం మరింత కుంగదీసింది. మనోబలంతో వేసిన అడుగు ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. అప్‌సైక్లింగ్‌ చేసిన చెత్త ప్లాస్టిక్‌ను మగ్గంపై నేసి బ్యాగులు, పండ్ల బుట్టలు, కిరాణా సంచులు... రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ అరుదైన కళలను తోటి మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం కల్పించింది. రాజీబెన్‌ జీవితంలో అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొని ఎదిగిన తీరు తన మాటల్లోనే విందాం.

            'మాది గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలోని భుజ్‌లోని కోటరు గ్రామం. మా అమ్మనాన్నలకు ఆరుగురు ఆడపిల్లలం, ఒక అబ్బాయి. 'ఆడపిల్ల అంటే ఇంట్లోనే ఉండి పనిచేసే మనిషి' అనే అభిప్రాయం ఉన్న కుటుంబం మాది. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అవకాశం ఉన్నా పంపలేదు. నాకేమో చదువు అంటే ఇష్టం. ఎలాగైనా స్కూలుకు వెళ్లి చదువుకోవాలన్న ఆశ ఉండేది. ఇంట్లో చెప్పకుండా స్కూలుకు వెళ్లేదాన్ని. కొన్ని రోజుల పాటు నా కదలికలు గమనించిన అమ్మ నన్ను కొట్టింది. వ్యవసాయాధారిత కుటుంబం కావడంతో నిత్యం పొలాల్లోనే గడిపేవాళ్లం. వర్షాకాలంలో మాత్రమే పనులు సాగేవి. మిగిలిన రోజుల్లో ఇంట్లోనే ఖాళీగా ఉండేవాళ్లం. అలా ఉండటం ఇష్టం లేక పన్నెండేళ్ల వయస్సులో మా బంధువుల దగ్గర మగ్గం వర్క్‌ నేర్చుకోవడానికి వెళ్లా. అదీ ఇష్టం లేక నాన్న అడ్డు చెప్పారు. ఆ బంధువు వాదించి నాకు ఆ విద్య నేర్పించాడు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఊహించలేదు.
 

                                                                      ఊహించని మలుపు

నాలుగేళ్ల పాటు వర్షాలు లేక ఊహించని కరువు ఏర్పడింది. అప్పు చేసి ఇల్లు గడిపాడు నాన్న. తిరిగి డబ్బులు ఇవ్వలేదని అవమానించారు. చేసేదిలేక నాన్న నన్ను మగ్గం వర్క్‌ చేయమని పురమాయించాడు. వాటితో కొంచెం ఇంట్లో తిండి గింజలు కొనుక్కోగలిగాం. మగ్గం నేయడం చెల్లెళ్లకూ నేర్పించా. కొంచెం డబ్బులు కూడుతున్నాయి అనుకునే లోపే నాకు పెళ్లి చేశారు. ఆర్థికంగా స్థిరపడాలన్న నా కోరిక వినిపించుకోలేదు. ఇంటికి పెద్ద కోడలను కావడంతో ఇంటి బాధ్యత నాపై పడింది. అందరూ పనులకు వెళితే వాళ్లకు వండి పెట్టడమే సరిపోయేది. కొన్నాళ్లకు ముగ్గురు బిడ్డల తల్లినయ్యా. పిల్లలు ఎదిగారు. వారిని బాగా చదివించాలన్న పట్టుదలతో ఉండేది. ఈ క్రమంలో పిడుగులాంటి సంఘటన నా జీవితంలో చోటుచేసుకుంది. భర్త మరణం నన్ను మానసికంగా కుంగదీసింది. పిల్లలూ తండ్రి లేడని దిగులు వేసుకున్నారు. వారి ముఖాల్లో తిరిగి ఆనందం చూడాలనుకున్నా. దుఖాన్ని దిగమింగా. ధైర్యాన్ని కూడగట్టుకుని పిల్లల్ని తీసుకుని అక్క ఇంటికి దగ్గర్లో నివాసం ఉన్నా. అక్కడా ఒంటరి మహిళగా వేదింపులకు గురయ్యా. అవమానాలు ఎదుర్కొన్నా. అందుకే ఎవరి దగ్గరా కూలి పనికి వెళ్లకుండా మగ్గం నేయడం ప్రారంభించా. కాని ఎవరూ వర్క్‌ చేయించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాదు. దాంతో ఇల్లు కష్టంగా గడిచింది.
 

                                                                 చెత్త ప్లాస్టిక్‌తో పనా ? అన్నారు

పన్నెండేళ్ల క్రితం... హస్తకళల్లో నైపుణ్యం ఉన్న ఖమీర్‌లో నివాసం మార్చా. అక్కడ మగ్గం వర్క్‌ వేగంగా వేయడం ఎలాగో నేర్పించారు. మగ్గం నేస్తున్నప్పుడు ఆలోచనలు పక్కకు వెళ్లకూడదు. చేతులు, కాళ్లు నొప్పులు పుడతాయి. కష్టమైనా శ్రమించా. ఓసారి ఖమీర్‌కు డిజైనర్‌ హేతల్‌ వచ్చారు. ఆయన పనికిరాని ప్లాస్టిక్‌తో మగ్గం నేయడంపై చర్చించారు. అది నాకు ఆసక్తిగా అనిపించింది. నా చుట్టూ ఉన్న వారు 'చెత్త ప్లాస్టిక్‌'తో పని ఏంటి? అని వెక్కిరించారు. కొంతమంది అయితే నవ్వారు కూడా. అయినా నా మనసుకు నచ్చిన పని చేయాలనిపించింది. పర్యావరణ మేలుచేసే ఈ పనిపట్ల ఆసక్తి ఏర్పడింది. ఇంకాస్త ముందుకు వెళ్లి పని విధానం నేర్చుకున్నా. వర్క్‌షాపులకు హాజరయ్యా. చెత్త ప్లాస్టిక్‌ను దారాలుగా మార్చి, మగ్గం మీద నేసి రకరకాల ఉత్పత్తులను తయారుచేయడం నేర్చుకున్నా. వాటిని ఎగ్జిబిషన్లలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది. అప్పుడూ ఎన్నో విమర్శలు. ఎక్కడకు వెళుతుంది? ఏం చేస్తుంది? అంటూ ఆరాలు తీసేవారు. అవేమి పట్టించుకుండా నా పని మీద దృష్టి పెట్టా.
 

                                                                      తోటి మహిళలకు ఉపాధి

ఊరికి వచ్చాక పొరుగువారి నుంచి పడేసిన ప్లాస్టిక్‌ సంచులను సేకరించా. వాటిని కడిగి, రెండు రోజులు ఎండబెట్టి, పొడుగ్గా కత్తిరించా. ప్లాస్టిక్‌ షీట్లను తయారు చేయడానికి మగ్గాన్ని ఉపయోగించాం. అలా ప్లాస్టిక్‌ షీట్లు చేసి బ్యాగులు, బాక్సులు, పర్సులు, కూరగాయల బుట్టలు, పండ్ల బుట్టలు, పూలబుట్ట సుమారు 20 రకాల వస్తువులు తయారుచేశాం. ఈ వస్తువులకు బ్రాండ్‌ పేరు పెట్టలేదు. అయినా కళాత్మకంగా డిజైన్లతో తయారు చేసిన వస్తువులను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ పనిలో నైపుణ్యం సంపాదించి నా తోటి మహిళలకు పని నేర్పించి ఉపాధి మార్గం చూపా. నాలుగేళ్ల క్రితం మేమంతా ఓ బృందంగా ఏర్పడి వస్తువులు చేస్తున్నాం. పర్యావరణానికి మేలుచేసే వస్తువులుగా.. దేశంలో చాలా చోట్లా ఎగ్జిబిషన్లలో ప్రదర్శించా. వీటిని చూసి ప్రభుత్వ అధికారులూ మెచ్చుకున్నారు. రాష్ట్రపతి అవార్డు విజేత, స్వచ్ఛ్‌ సుజల్‌ శక్తి సమ్మాన్‌ అవార్డులు అందుకున్నా. చదువుకోకపోయినా లండన్‌ వెళ్లి మరీ మా వస్తువులను అమ్ముతున్నా. చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉండాలి.' అంటారు.