శరద్యుతి ఐదో తరగతి చదువుతోంది. ఒకరోజు తండ్రితో కలిసి పాఠశాలకు బయలుదేరింది. తండ్రితో కలిసి నడుస్తున్న శరద్యుతి రోడ్డు పక్కన ఏదో చూస్తూ ఆగిపోయింది.
''ఎందుకు ఆగిపోయావు? పాఠశాలకు సమయం అవుతుంది..'' అన్నాడు తండ్రి.
''నాన్నా ! అటువైపు చూడు'' అన్నది.
రోడ్డు పక్కన కోడి, దాని పిల్లలు కన్పించాయి. అవి చెత్తలో ఆహారాన్ని ముక్కుతో పొడుస్తూ తింటున్నాయి. కోడిని, పిల్లలను ఎప్పుడూ చూడలేదా! అని ప్రశ్నించాడు తండ్రి.
''అది కాదు నాన్నా ! కోడి, దాని పిల్లలు అన్నం అనుకొని, థర్మాకోల్ షీట్ ముక్కలు చేసుకొని తింటున్నాయ''ని చెప్పింది.
తండ్రి ఆ దృశ్యాన్ని పూర్తిగా గమనించలేదు. శరద్యుతి చెప్పిన తర్వాత చూశాడు. నిజమే! ఇప్పుడు ఏం చేద్దాం? స్కూలుకు సమయం అవుతుంది పదా! అన్నాడు.
''అది కాదు నాన్నా ! కోడి గింజలు, పురుగులు తింటాయని మా సైన్స్ టీచర్ చెప్పింది. కానీ తల్లి కోడి తెలియక థర్మాకోలును ఆహారంగా చేసి, పిల్లలకు పెడుతుంది. అది తింటే ఆరోగ్యం పాడవుతుందని వాటికి తెలియదు కదా!'' అన్నది.
''అయితే ఏం చేద్దాం!'' అన్నాడు తండ్రి.
''నువ్వు తల్లి కోడి, పిల్లలు తింటున్న థర్మాకోలును మెల్లగా తీసెయ్యి. నేను అమ్మ పెట్టిన అన్నం వాటికి వేస్తా..'' అన్నది శరద్యుతి.
పాప జాలి గుణానికి తండ్రి ఆశ్చర్యపోయాడు. వెంటనే తల్లి కోడి దగ్గరగా వెళ్లాడు. అది భయంతో పిల్లలను తీసుకుని దూరంగా జరిగింది. వెంటనే థర్మాకోలును తీసేశాడు. శరద్యుతి అమ్మ బాక్సులో పెట్టిన అన్నాన్ని కొంత తల్లి కోడి, పిల్లల ముందు ఉంచింది. తల్లి కోడి దాన్ని ముక్కుతో పొడిచి తింటూ పిల్లల్ని పిలిచింది. ఆ దృశ్యాన్ని చూసిన తండ్రి తాను చేయాల్సిన పనిని తన కూతురు చేసినందుకు మనసులో సంతోషించాడు. తరువాత ఇద్దరూ పాఠశాల వైపు నడక సాగించారు.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర
94923 09100










