''పదాలకెన్ని అర్థాలు/ అర్థానికెన్ని శబ్దాలు
వాక్యానికెన్ని దారులు
పండితుణ్ణి పామరుణ్ణి / అలరించిన కవిత్వం
పదునైన ఖడ్గమై / దుష్టశక్తుల్ని దునుమాడుతుంది
మానవత్వం సుక్షేత్రంలో / దిగుబడులు తియ్యమంటుంది' - నాలుగు దశాబ్దాలుగా దారి తప్పని కలం రాసిన కవిత్వం ఇది. పదాలకెన్ని అర్థాలున్నా, వాక్యానికెన్ని దారులున్నా, అడిగోపుల వెంకటరత్నానిది అలుపెరగని అభ్యుదయ మార్గం. మజిలీలు లేని పురోగమన పథం. కొంతమంది రాసినదానితో తృప్తి పడతారు. ఇంకొంతమంది వచ్చిన పేరుతో మురిసిపోతారు. మరికొంతమంది రాయాల్సిందెంతో వున్నా రాయరు. నిత్య చైతన్యాత్మకమైన అడిగోపుల కలం, నిర్భయ గళం ''ముందడుగు' వేస్తూనే వుంది. కొత్త 'సూర్యోదయాల్ని' ఆవిష్కరిస్తూనే వుంది. 'జయభేరి' మోగిస్తూనే వుంది. వైయక్తికత నుంచి సామాజికత వైపు పయనిస్తూనే వుంది. కాలానుగుణంగా 'కొత్తగాలి'ని కవిత్వంలో ప్రసరిస్తూనే వుంది . కొత్త ఉదయాల కోసం నిరీక్షిస్తూనే వుంది.
అడిగోపుల వెంకటరత్నమ్ నిరంతరకవి. వర్తమానంలోంచి భవిష్యత్తు వైపు పయనించే కవి. ఇన్నేళ్ళ స్వాతంత్య్రాన్ని, అది ప్రసాదించిన దారిద్య్రాన్ని, అందుకు కారణమైన దగుల్బాజీ రాజకీయాన్ని సజీవంగా చిత్రించే కవిత్వం అడిగోపులది. సమాజంలోని దు:ఖాశ్రువులకు భాష్యం అడిగోపుల కవిత్వం.
''నా నరకం నాది కాదు/ ఎదుటివాడి అర్పణం
వాడి స్వర్గం వాడిది కాదు/ నా స్వార్జితం' - శ్రమదోపిడీని ఇంత సంక్షిప్తంగా, సరళంగా చెప్పిన ఆధునిక కవి అడిగోపుల మినహా మరొకరు లేరు. కవిత్వం పేరుతో అస్పష్టతను, అర్థం కాని ప్రతీకలను పాఠకులపై రుద్దే కవులున్న కాలంలో అడిగోపుల స్వీయ శైలిని నిర్మించుకున్నాడు. ఆయన కవిత్వంలో రాజకీయం వుంటుంది. కాని ఆయనది రాజకీయ కవిత్వం కాదు. సామాజిక స్పర్శ, సాహిత్యపు పరిమళం సమతూకంగా సాగుతాయి. అడిగోపుల కవితల్లో పలుకుబడి ఏ పలుకుబడికీ లొంగదు.
'ఋతువులు పుష్పిస్తుంటాయి/ సంవత్సరాల్ని కాస్తుంటాయి'
'మనిషి పుట్టుకతోనే/ మతం ఒక అవయవమైంది'
'అస్తమయాన్ని ఉదయం / ఉదయాన్ని అస్తమయం వెంటబడుతూ
మారుతున్న యుగంలో/ మారని గమనం'
'కర్షకుడు ప్రజల హర్షకుడు' - ఇలాంటి పదునైన వాక్యాలు అడిగోపుల కలం నుంచి అలవోకగా వస్తాయి.
వర్తమాన కవుల్లో వస్తు దారిద్య్రం స్పష్టంగా కనిపిస్తుంది. నిత్యం కనిపించే సమాజంలో కనిపించని అగాధాలను, ఆవేదన మూలాలను తవ్వి కన్నీటి చెలమల్ని బయటకు తీస్తాడు అడిగోపుల. 'కుటుంబ భారం మోస్తున్న/ బాల్యం బాధ చూసి/ కలత చెందిన పొలం / రాలిన పరిగను ఏరుకోమంటుంది' - ఈ పదాలు చదివాక అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. 'అశ్రువీధిలో అగ్నిగానం' విన్న అడిగోపుల 'రాతి చిగుళ్ళు'లో మానవతా రాగాన్ని వెతికితీశాడు. 'మరణానికి రెండు ముఖాలు'ంటాయని ప్రప్రధమంగా గుర్తించింది ఆయనే! 'కాలం నా చేతిలో వుంద'ని కలంతో నిరూపించాడు.
అడిగోపుల వస్తు దృష్టి, భావ సృష్టి విలక్షణమైంది. ఏది చెప్పినా దాపరికం లేని భాషలో రాస్తాడు. 'రైతు మనసు తూకం చూస్తుంది/ త్రాసు కన్నీటిలో స్నానం చేస్తుంది'- అంటూ రైతు కన్నీళ్ళను పరిచయం చేస్తూ జాతీయ జెండాలో ఆకుపచ్చని రంగును భూమికి పూసే రైతులో అడిగోపుల పరకాయ ప్రవేశం చేస్తాడు. 'తెనుగు లెంక' తుమ్మల, 'కవికోకిల' దువ్వూరి, 'కవిబ్రహ్మ' ఏటుకూరి వంటి కవుల కర్షక కవిత్వాన్ని విత్తులో వృక్షం ఉన్నట్లుగానే, అడిగోపుల కవిత్వంలో విప్లవముంది. అది ఆయన పరిణితికి ప్రమాణం. 'నా గదే నాకు విశ్వవిద్యాలయం' - అన్న అడిగోపుల 27 కవితా సంపుటాల్లో 1500 పైగా కవితలకు పురుడు పోశాడు. కుందుర్తి కలగన్న వచన కవితా వికాసం అడిగోపుల కలంలో ఊపిరి పోసుకుంది. వస్తు వైవిధ్యం, ఎత్తుగడ, నిర్మాణం, ముగింపు, వ్యంగ్యాత్మకమైన శీర్షికలు అడిగోపుల వారిని విలక్షణ కవిగా నిలిపాయి.
'యుగాలు తిరగేస్తున్నాను/ చరిత్ర తవ్వి తీస్తున్నాను/ బాణాలు ఇప్పటికీ గుచ్చుకుంటున్నాయి/ ఎత్తుగడలు యీ నాటికీ జీవిస్తున్నాయి'. మనిషి స్వార్థంతో జీవించే ఎత్తుగడలు కవి భావుకతకు ప్రతీకలైన ఎత్తుగడలు అడిగోపుల కవిత్వంలో పోటీ పడతాయి. అంతు చిక్కని మార్మికత, అర్థం కాని తాత్వికత వారి మాటల్లో మచ్చుకైనా వుండవు. ఎన్ని ఇబ్బందులెదురైనా, సమస్యలు చుట్టుముట్టినా, అధికారం అణచి వేసినా కర్తవ్య నిర్వహణలో, నవ సమాజ నిర్మాణంలో మానవుడే కట్ట కడపటి విజేత అని నిర్ద్వంద్వంగా ప్రకటించి, జయకేతనం ఎగరేస్తాడు. ఎప్పటికైనా నా వేళ్ళు చూపుడు వేళ్ళవుతాయని సమాజపక్షంలో ఫలభరితం అవుతుందన్న ఆశను, ఆకాంక్షను ప్రకటిస్తాడు.
అభ్యుదయ కవిత్వానంతరం వచ్చిన కవిత్వోద్యమాలన్నీ అడిగోపుల కవిత్వంలో ప్రతిఫలించాయి. ఇజాలకతీతమైన నిజాల్ని చెప్పిన కవి అడిగోపుల. సాహిత్య స్పృహతో నిరంతరం సాగుతున్న నిలువెత్తు సామాజిక కవి. వేదికలకు, వివాదాలకు దూరంగా వుండే నిరాడంబర కవి. నిజాయితీ వారి చిరునామా! కవిత్వం వారి వీలునామా! కవిత్వంతో కరచాలనం చేస్తూ కాలాన్ని వ్యాఖ్యానించే దారి తప్పని అడిగోపుల కలానికి కవిత్వాభినందనలు.
- డా|| బీరం సుందరరావు
63034 43302










