Oct 15,2023 22:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, యంత్రాంగం :టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. 'న్యాయానికి సంకెళ్లు' పేరుతో చేతులకు రిబ్బన్లు, తాళ్లు, గొలుసులతో సంకెళ్లు వేసుకుని నిరసనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 నుంచి 7.05 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని క్యాంప్‌ సైట్‌ వద్ద నారా భువనేశ్వరి, మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసనలో పాల్గన్నారు. 'అధర్మం నశించాలి', 'అన్యాయం నశించాలి' అని నినదించారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని తన భార్య బ్రాహ్మణితో కలిసి నిరసన తెలిపారు. ఏ ఆధారాలు లేకపోయినా రాజకీయ కక్షతో ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని లోకేష్‌ ఈ సందర్భంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో జరిగిన నిరసనలో ఆ పార్టీ నేతలు కళ్లం రాజశేఖర్‌ రెడ్డి, వల్లూరి కిరణ్‌ తదితరులు పాల్గన్నారు. విశాఖలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నిరసనలో పాల్గని మాట్లాడారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును ఆరెస్టు చేశారన్నారు. నెల్లూరులో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజలతో కలిసి చేతులకు ఇనుప గొలుసులు కట్టుకొని నిరసన తెలిపారు. శ్రీకాకుళంలోని ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు నిరసన తెలిపారు. ఆమదాలవలసలో కూన రవికుమార్‌ ర్యాలీ నిర్వహించారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టిడిపి నాయకులు చేతులకు సంకెళ్లతో ఆందోళన చేశారు. గుంటూరు, కృష్ణా, ఒంగోలు, విజయనగరం, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టిడిపి నాయకులు నిరసనలో పాల్గొన్నారు.