సుభద్రకు చిన్నప్పటి నుంచి ఆస్తమా సమస్య ఉంది. పెళ్లయి పిల్లలున్నా ఇప్పటికీ ఆ సమస్య వేధిస్తోంది. బాల్యంలో కంటే ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతోంది. దీంతో తరచూ హాస్పటళ్ల చుట్టూ తిరగాల్సివస్తోంది. జానకికి బాల్యంలో ఆస్తమా లేకపోయినా పెళ్లయిన తరువాత నుండి వ్యాధితో బాధపడుతోంది. దీనికి తోడు చర్మసంబంధిత అలెర్జీలు ఆమెను పట్టిపీడిస్తున్నాయి. ఈ ఇద్దరు మహిళల్లో ఈ సమస్య పైకి చాలా సాధారణంగా కనబడుతోంది. పైగా పనుల ఒత్తిడిల్లో నిత్యం సతమతమయ్యే మహిళలు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడడం చాలా మామూలు విషయంగా పరిగణిస్తాం. కానీ ఈ అనారోగ్యం వెనుక ఆమె పడుతున్న గృహహింస కూడా ఒక కారణమని పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలో అనేక మంది మహిళలు ఎదుర్కొనే గృహహింస ఆమెను మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల పాల్జేస్తున్నదని ఒక పరిశోధనలో తేలింది.

గృహహింసకు గురైన మహిళల్లో ఆస్తమాతో పాటు అటోపిక్ వ్యాధులు (చర్మ సంబంధిత అలెర్జీలు, ప్రకృతి సంబంధ కారణం లేకుండా సంక్రమించే వ్యాధులు) ఎక్కువగా ప్రబలుతున్నట్లు లండన్‌కు చెందిన 'జర్నల్ ఆఫ్ అలెర్గి అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ'లో ప్రచురితమైంది. మహిళల్లో వ్యాధి తీవ్రతలపై నివేదికను తయారుచేసిన డాక్టర్ల బృందం వారు తరచూ ఎదుర్కొంటున్న గృహహింసపై కూడా పరిశోధనలు చేసింది. గృహహింసకు గురికాని మహిళల వ్యాధి తీవ్రత కంటే గృహహింసకు గురవుతున్న మహిళల్లో తీవ్రత ఎక్కువగా ఉందని నివేదికలో తేలింది.
'గృహహింసకు గురౌతున్నట్లు చెప్పిన మహిళల్లో 52 శాతం మందికి 'అటోపిక్ వ్యాధులు' తీవ్రంగా ప్రబలినట్లు' లండన్‌లోని 'యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హమ్'కు చెందిన వైద్యులు డాక్టర్ జొహట్ సింగ్ చందన్ తెలిపారు. 'ప్రపంచవ్యాప్తగా గృహహింసకు గురవుతున్న మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. మా నివేదిక దాన్ని ఆధారం చేసుకొనే తయారుచేశాం. మా బృందం మొదట బాధిత మహిళల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు, ప్రజారోగ్య విధానాల ప్రభావం వంటి వాటిపై చేయాలనుకున్నాం. అయితే పరిశీలనా క్రమంలో గృహహింస బాధితులను ప్రత్యేకంగా అంచనా వేశామ'ని సింగ్ అంటున్నారు.
'మా డాక్టర్ల బృందం గృహహింసకు గురైనట్లు బహిర్గతమైన 18 ఏళ్ల పైబడిన మహిళల ఆరోగ్య సమస్యలను, గృహహింసకు గురికానటువంటి మహిళల ఆరోగ్య సమస్యలతో సరి పోల్చింది. బాధితులమని పేర్కొన్న 13, 852 మంది మహిళలను బాధితులు కాని 49, 036 మహిళలతో అంచనా వేసినప్పుడు బాధితుల్లో 967 మంది(7 శాతం), బాధితులు కానివారిలో 2,607(5.3 శాతం) మందిలో ఆస్తమా సమస్యతో పాటు అటోపిక్ వ్యాధులు ప్రబలినట్లు గుర్తించారు. పైగా బాధితుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలిందని' సింగ్ చెబుతున్నారు.










