Jul 01,2023 11:22
  • మూడేళ్లలో 19 లక్షల గిరిజనులకు సికెల్‌ సెల్‌ పరీక్షలు
  • నాలుగు లక్షల ర్యాపిడ్‌ కిట్లు కొనుగోలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు జె నివాస్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే...

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ మంచి సత్ఫలితాలు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్‌ ద్వారా 1.17 కోట్ల మందికి వైద్యసేవలందాయి. ప్రతి పిహెచ్‌సికీ ఇద్దరు డాక్టర్లవంతున వెయ్యి మందిని ప్రభుత్వం రిక్రూట్‌ చేసింది. తొలుత చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బ్లడ్‌ శాంపిల్‌ తీసి వారిలో బిపి, షుగర్‌ ఉన్న వాళ్లను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా హెల్త్‌ ఐడి క్రియేట్‌ చేశాం. ఐడిలో నమోదు చేసిన వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌ సెల్‌కు సమాచారం వస్తుంది. డాక్టర్‌ ఆయా గ్రామానికి వెళ్లినప్పుడు బిపి, షుగర్‌ ఉన్న వాళ్లకు మందులు అందిస్తారు. మెటర్నిటీ హెల్త్‌ ఉన్న వాళ్లను పరిశీలించడం, ఆయా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను డాక్టర్లు సందర్శిస్తారు. అనీమియా ఉన్న పిల్లలకు రెగ్యులర్‌గా టీచర్లు సక్రమంగా మందులు ఇస్తున్నారా లేదా? అనేది డాక్టర్లు పరిశీలిస్తారు. పిహెచ్‌సిల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారా లేదా? అనేది మానిటరింగ్‌ చేస్తూ నెలకోసారి ఆడిట్‌ చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో సికెల్‌ సెల్‌ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి 0 నుంచి 40 వయసు గల గిరిజనులకు 19 లక్షల మందికి సికెల్‌ సెల్‌, సికెల్‌ సెల్‌ డిసీజ్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నాం. ర్యాపిడ్‌ కిట్స్‌ ఈ సంవత్సరానికి నాలుగు లక్షలు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతానికి 10 వేల కిట్స్‌ కొనుగోలు చేశాం. మిగిలినవి ఈ ఏడాదిలోగా తీసుకుంటాం. ఎయిడ్స్‌ పాజిటివ్‌ పేషెంట్లు కంటెన్యూస్‌ ట్రీట్‌మెంట్‌ కు అనేకమంది వైద్యానికి రావడం లేదని గుర్తించాం. రాష్ట్రంలో సుమారు 45 వేలమంది ఎయిడ్స్‌ పేషెంట్లు ఉండగా, అందులో 17 వేలమంది వైద్య పరీక్షలకు రావడం లేదు. వీరందరినీ వైద్యానికి రెగ్యులర్‌గా తీసుకొచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెబుతున్నాం. ఎయిడ్స్‌ పరీక్షలు, ఐసిటిసి పరీక్షలు 255 ల్యాబ్స్‌ ద్వారా నిర్వహంచడం జరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో ల్యాబ్‌లు లేని ప్రాంతాల్లో ఎయిడ్స్‌ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించేందుకు కొత్తగా ఎనిమిది మొబైల్‌ ఐసిటిసి వాహనాలను త్వరలో ప్రారంభిస్తాం. పిఎంజెవైను ఆరోగ్యశ్రీ కార్డులో కలిపేసుకున్నాం. రాష్ట్రంలో 1.48 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులుండగా, కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కార్డులకే సపోర్టు చేస్తోంది. ఆయా కార్డులను వలంటీర్‌ ద్వారా చెక్‌ చేయించి, ఆయా గృహాలను ఐడెంటిటీ చేస్తున్నాం.
      జిఎన్‌ఎమ్‌ క్వాలిఫికేషన్‌ ఉన్న వాళ్లు స్టాఫ్‌ నర్స్‌కు అర్హులు.. ఎఎన్‌ఎమ్‌లకు జిఎన్‌ఎమ్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నాం. శిక్షణ పూర్తయిన వాళ్లకు ఎఎన్‌ఎమ్‌ టు జిఎన్‌ఎమ్‌ క్వాలిఫికేషన్‌ ఉన్న వాళ్లు ఉన్నారు. క్వాలిఫికేషన్‌ ఉన్న వాళ్లు, శిక్షణ పూర్తయిన వాళ్లను కలుపుకుని స్టాఫ్‌ నర్సులుగా డిఎంఎ, ఎపివివిపిలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం.