Sep 04,2023 16:38

ప్రజాశక్తి - అనకాపల్లి : ప్రజాశక్తి వి.మాడుగుల విలేకరి సురేష్‌ శాంతో (45) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆదివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్‌టిఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. సురేష్‌ శాంతో మాడుగుల ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులుగా పని చేశారు. ప్రస్తుతం కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రజాశక్తిలో ఆయన పదేళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేశారు. పలు షార్ట్‌ ఫిల్మ్‌ల్లోనూ ఆయన నటించారు. ఆయన మృతి పట్ల ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌, సిజిఎం అచ్యుతరావు, జనరల్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెస్‌క్లబ్‌ల నాయకులు సంతాపం తెలిపారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాడుగుల యువత సంతాప సభ నిర్వహించింది.