ఇంటర్నెట్‌డెస్క్ : దశాబ్దానికిపైగా అమెజాన్ కంపెనీకి సేవలందిన సీనియర్ లీడర్ డేవ్ లింప్ ఆ కంపెనీని వీడనున్నట్లు అమెజాన్ మంగళవారం ప్రకటించింది. లింప్ అమెజాన్‌లో పరికరాల రూపకర్తగా.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డివైసెస్‌గా ఆ కంపెనీలో కొనసాగారు. అలెక్సా మరియు స్మార్ట్ పరికరాలను రూపొందించడంలో లింప్ ఘనత పొందారు. అయితే అమెజాన్‌లోని నాయకత్వం కారణంగా కంపెనీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు వస్తున్న వార్తలను లింప్ ఖండించారు. ప్రస్తుతం అమెజాన్‌లో తన సహోద్యోగులతోపాటు మాజీ సిఇఓ జెఫ్ బెజోస్, ప్రస్తుత సిఇఓ జాస్సీ నాయకత్వాన్ని లింప్ ప్రశంసించారు. వారు సమర్థవంతంగా కంపెనీని నడిపించగలరని విశ్వసిస్తున్నట్లు లింప్ పేర్కొన్నారు. నిర్మాణాలు, షిప్పింగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి కొత్త రంగాలవైపు ఆసక్తి చూపుతున్నట్లు.. వీటికోసం దాదాపు మూడు దశాబ్దాలకుపైగా సమయం పడుతుందని.. అందుకే తాను అమెజాన్ కంపెనీని వీడుతున్నట్లు తెలిపారు. లింప్ దాదాపు 14 సంవత్సరాలుగా అమెజాన్ కంపెనీలో ఉన్నారు. కొన్ని నెలల్లో కంపెనీని వీడనున్నారు. ఈ సందర్భంగా లింప్ 'అన్ని వ్యాపారాల్లో అమెజాన్ జోరుచూసి నేను ఆశ్చర్యపోయాను. అమెజాన్ పట్ల వినియోగదారులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుత అమెజాన్ వ్యాపారం బాగున్నా.. వీటన్నింటికి మించి మనం కంప్యూటర్ సైన్స్ స్వర్ణయుగంలో జీవిస్తున్నాం' అని ఆయన అన్నారు. అయితే లింప్ ఎప్పుడు అమెజాన్ నుంచి నిష్క్రమించేది మరికొన్ని వారాల్లో ప్రకటించనున్నట్లు సిఇఓ జాస్సీ తెలిపారు. 'డేవ్ నాయకత్వంలో వినియోగదారులు ఇష్టపడే పరికరాలను, అంతర్లీన సేవలను నిర్మించడంలో అమెజాన్ ప్రపంచంలోని ప్రముఖ ఆవిష్కర్తల్లో ఒకటిగా నిలిచింది. కిండ్లే రీడర్స్ నుండి ఫైర్ టీవీ, అలెక్సా, ఎకో వరకూ గత దశాబ్దన్నర కాలంగా.. వినియోగదారుల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడే అనుభవాలను కనుగొనగలిగాము. వాటిని మెరుగుపరచగలుగుతున్నాము' అని జాస్సీ చెప్పారు.










