Jul 11,2023 09:24

పోటీ ప్రపంచంలో ఉన్నతవిద్య కోసం తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్స్‌లో ఉంచి చదివించాల్సి వస్తోంది. అప్పటివరకూ అమ్మానాన్నల దగ్గర ఉన్న పిల్లలు ఒక్కసారిగా హాస్టల్‌కు వెళ్లాల్సినప్పుడు వారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఆ క్రమంలో మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇంట్లోవాళ్లను విడిచి ఉండలేక, హాస్టల్‌ వాతావరణంలో ఇమడలేమోనని భయాందోళనలకు గురవుతారు. ఈ నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

         రమ్య ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యింది. పై చదువుల కోసం వేరే రాష్ట్రం పంపించాల్సి వచ్చింది. ఫీజు కట్టి కాలేజీకి దగ్గర్లో ఉన్న హాస్టల్లో చేర్పించారు. ఎప్పుడూ తల్లిదండ్రులను వదిలి వుండని రమ్య కొద్ది రోజులకే హాస్టల్లో ఉండలేనని ఏడుస్తోంది. అక్కడ వాతావరణం అలవాటు లేక ఫోన్‌ చేసినప్పుడల్లా ఒకటే ఏడుపు. దాంతో చదువు మీద ఏకాగ్రత కుదరలేదు. ఆ గందరగోళంతో వారాంత పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేకపోయింది. ఇది తనలో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
       మొదటిసారి హాస్టల్‌కు వెళ్లిన చాలామంది పిల్లలు పరిస్థితి ఇలాగే ఉంటుంది. హాస్టళ్లను బందీఖానాలుగా భావిస్తారు. ప్రేమగా పలకరించేవారు లేరని మధనపడతారు. అలా ఆత్మన్యూనతా భావానికి లోనవ్వకుండా తల్లిదండ్రులే పిల్లలను సిద్ధం చేయాలి. అందుకే పిల్లల్ని ముందు నుంచే మానసికంగా సిద్ధం చేయాలంటున్నారు విద్యావేత్తలు. ఇంటిని విడిచిపెట్టడం వల్ల వారి మనసులో కలిగే భయాందోళనలపై చర్చ జరపాలి. వాటన్నింటికీ సానుకూలంగా స్పందిస్తూనే.. దూరంగా ఉండి ఎందుకు చదివించాల్సి వస్తోందో కారణాలను వివరించాలంటున్నారు నిపుణులు.
        ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. దాంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. ఈ క్రమంలో పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంది? వారు ఏమి ఆలోచిస్తున్నారు. ఎలా ఉంటున్నారో పూర్తిగా తెలుసుకోలేక పోతున్నారు. టీనేజి వయస్సు పిల్లలకు అందించాల్సిన ప్రేమ వారికి అందివ్వాలి. వారితో స్నేహం చేయాలి. ఆ వయసులో వచ్చే ఆలోచనలను, వాటి పరిణామాలు వివరించాలి. అవి కూడా సలహాలు, సూచనలుగానే ఉండాలి.

  • పిల్లలకు తమ శక్తిసామర్థ్యాలపై నమ్మకం కలిగేలా మాటలు చెప్పాలి. అవే అననుకూల పరిస్థితులను తట్టుకునే ధైర్యాన్నిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచి స్నేహితులతో కలసి చదువుకోవడం, ఆడుకోవడం అలావాటు చేయాలి. అప్పుడే వారి సొంత ఆలోచనలు, నిర్ణయాలు బహిర్గతం చేసే వీలుంటుంది.
  • తోటి పిల్ల్లలతో కలసి జీవించడం అంటే సర్దుబాటు చేసుకోవడం, ఇతరులకు సాయం చేయడం, ఒకరికొకరు సహకరించుకోవడం, స్నేహితులతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడం వంటివి అని చెప్పాలి. ఇప్పటికే హాస్టల్‌ వాతావరణంలో ఉండి చదువుకుంటున్న పిల్లలతో కొద్ది రోజులు మాట్లాడనీయండి. దాంతో వారికి ఉన్న భయాలు, అనుమానాలు తీరతాయి. వారిపై కొంత నమ్మకం కలుగుతుంది.
  • హాస్టల్‌కు పంపే కొన్నిరోజుల ముందు నుంచే నిర్ణీత వేళకు మేల్కొనడం, తమ గది, తమకు సంబంధించిన వస్తువులను స్వయంగా శుభ్రం చేసుకునేలా ప్రోత్సహించాలి. వారికిష్టమైన వస్తువులను, ఆహారాన్ని వారితో తీసుకెళ్లే ఏర్పాట్లు చేయండి. ఎల్లప్పుుడూ తల్లిదండ్రులుగా మీ మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వండి. మధ్యమధ్యలో వెళ్లి కలిసి మాట్లాడండి.