Sep 20,2023 08:32

''ఆడపిల్లలను కాపాడుకుందాం... అమ్మతనానికి విలువిద్దాం'' అంటూ ఓ యువతి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మహిళల సమస్యలపై పనిచేస్తున్నారు. ఆమె పేరు షెర్లీ దేవరపల్లి. వయస్సు 23 సంవత్సరాలు. అయితేనేం... 'మీకు నేనున్నా' అంటూ ఒంటరి మహిళలు, సెక్స్‌వర్కర్లు, గృహహింస బాధితులకు భరోసా ఇస్తున్నారు. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఆమె ఎంఎ సోషల్‌ వర్క్‌ కోర్సు పూర్తిచేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం తమిళనాడులోనే జరిగింది. అమ్మానాన్నలు కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. షెర్లీ సేవా ప్రస్థానం ఇదీ ...

44

 

          హైదరాబాద్‌లోని నారాయణ ఐఎఎస్‌ అకాడమీలో షెర్లీ బిఎ డిగ్రీ చదువుతున్న రోజులు. రోజూ మహిళలపై జరిగిన అఘాయిత్యాల గురించి వీడియాలో చదివి, చూసి చలించిపోయారు. మహిళల రక్షణ కోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తల్లిదండ్రులు జ్ఞానమణి, ఆనంద్‌కుమార్‌ సహకారంతో 'ది గుడ్‌విన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌'ను ఆమె స్థాపించారు.
          2020 వరదల్లో హైదరాబాదులో మురికివాడలైన చాదర్‌ఘాట్‌, మియాపూర్‌, నిజాంపేట, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ ప్రాంతాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. ఇక్కడికి వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. ఈ సమయంలో షెర్లీ తనతోపాటుగా వాలంటీర్లు భానుతేజ, మోనిక బాశెట్టి, దివ్యాంశ్‌, హృతిక్‌, గణేషన్‌ ఈశ్వర్‌, అనిల్‌ హృషిల సహాయంతో బాధితుల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. తొలిరోజే చాదర్‌ఘాట్‌లో 100, నిజాంపేటలో 60, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లో 200 మందికి ఆహారాన్ని పంచారు. షెర్లీ తనకు వచ్చిన కళను వనరుగా ఉపయోగించారు. 'స్కెచెస్‌ వేయించుకోండి.. డబ్బు ఇవ్వండి... ఆ డబ్బుతో వరద బాధితులకు సాయం చేస్తాం' అంటూ ఇచ్చిన నినాదానికి మంచి స్పందన వచ్చింది. చాలామంది తమ స్కెచెస్‌ వేయించుకుని పరోక్షంగా వరద బాధితుల ఆకలిని తీర్చారు.
 

                                                                     అనాథలకు ఆపన్నహస్తం

కరోనా సమయంలో దేశవ్యాప్తంగా 9 వేల ఆశ్రమాలకు విరాళాలు ఆగిపోవటంతో భోజనం పెట్టడానికి సైతం ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నారు. 'షేర్‌ లవ్‌ విత్‌ రాఖీ' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. అప్పట్లో రక్షాబంధన్‌ సందర్భంగా 20 ఆశ్రమాల పిల్లలకు ఆకలి తీర్చేందుకు తనవంతుగా కృషిచేశారు. రాఖీ కట్టించుకున్న వారంతా రూ.11 విరాళంగా ఇవ్వాలని కోరగా చాలామంది స్పందించారు. ఇలా ఒక్కో ఆశ్రమానికి రూ.5000 విరాళంగా అందించారు.

33

                                                              మహిళల ఆత్మస్థైర్యానికి కరాటే దోహదం

మహిళలకు స్వీయ రక్షణే ఆయుధమని, స్వీయ రక్షణ కోసం ప్రతి యువతీ, మహిళా కరాటే నేర్చుకోవాలని షెర్లీ అంటారు. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ పొందిన ఆమె దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థినులకు కరాటే తరగతులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆమె ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది కరాటే శిక్షణ పొందారు. బాలికలు, యువతులు, మహిళలకు లైంగిక విద్య, ఆత్మస్థైర్యం, ఆర్థిక స్వాతంత్య్రం, లింగవివక్ష, చదువు, ఉద్యోగం, ఉపాధి, కెరీర్‌గైడెన్స్‌, స్వయం ఉపాధి, కుట్టు శిక్షణ తదితర అంశాలపై శిక్షణా తరగతులను కొనసాగిస్తున్నారు.

55


                                                                 మహిళల హక్కులపై లఘుచిత్రం

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌, ఢిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌ తదితర ప్రాంతాల్లోని మురికివాడ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి మహిళలు పడుతున్న సామాజిక సమస్యలపై పలుసార్లు అధ్యయనం చేశారు. ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లోని సెక్స్‌ వర్కర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 'ఎట్రాక్టివ్‌ సిటీస్‌ ఎగెనెస్ట్‌ విమెన్‌' పేరుతో ఓ లఘు చిత్రం రూపొందించారు. ఆమె పర్యటించిన అన్ని ప్రాంతాల్లో దీనిని ప్రదర్శిస్తున్నారు. ఇందులో గృహహింస, లైంగిక వేధింపుల గురించి మహిళలు విముక్తి పొందే మార్గాలు, పోలీసు కేసులు, చట్టపరమైన అంశాలపై చూపించారు. మంచి స్పర్శ.. చెడు స్వర్శ గురించి తెలియజేసేలా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని కడప, అనంతపురం, శ్రీకాకుళం తదితర వెనుకబడిన ప్రాంతాలు, మురికివాడల్లో నివసించే యువతులు, మహిళలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తున్నారు.
             - యడవల్లి శ్రీనివాసరావు

88

                                                                   మహిళల హక్కులకోసం ...

మాకు ఒక తయారీ సంస్థ ఉంది. దానిని అమ్మానాన్న చూసుకుంటారు. వారిచ్చే ప్రోత్సాహంతోనే నేను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నా. రాష్ట్రాల్లో పర్యటించి, కరాటే శిక్షణ ఇస్తున్నా. ఓసారి తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలలో 50 మంది కన్నా తక్కువమంది పిల్లలు ఉండటం గమనించాను. డిజిటల్‌ పద్ధతిలో చదువు చెబితే పిల్లలు వస్తారని భావించా. కాలేజీలో నేను, నా స్నేహితులు గీచిన చిత్రాలను మహిళా దినోత్సవం రోజున అమ్మకానికి పెట్టాం. దాదాపు రూ.16 వేలు వరకూ వచ్చాయి. ఆ డబ్బును స్మార్ట్‌ టెక్నాలజీకి ఉపయోగించా. ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత 'ది గుడ్‌విన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌' ప్రారంభించా. దీనిద్వారా 'డిజిటల్‌ డ్రీమ్‌' అనే ప్రాజెక్టును చేపట్టిన తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్‌ విద్యాబోధనతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాను. మహిళలపై వేధింపుల నిరోధానికి గాను కేంద్ర ప్రభుత్వానికి, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందించాము.
                                                                               - షెర్లీ దేవరపల్లి
                                                             గుడ్‌విన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు