Jul 17,2023 21:03

ప్రజాశక్తి - మోతుగూడెం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రహస్యంగా మూడు కార్లలో తరలిస్తున్న 400 కిలోల గంజాయిని అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామం వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను ఎఎస్‌పి రాహుల్‌ మీనా, సిఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ గోపాలరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో మోతుగూడెం చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మూడు కార్లలో 20 ప్లాస్టిక్‌ బ్యాగుల్లో తరలుతున్న 400 కిలోల గంజాయిని పట్టుకున్నారు. డొంకరాయి గ్రామ శివారు ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు ఈ గంజాయిని తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్‌ బత్రు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన సాగర్‌ దిగంబర్‌, యోగేష్‌లకు గంజాయిని విక్రయించాడని, వారి కోసం అన్వేషిస్తున్నామని ఎఎస్‌పి రాహుల్‌ మీనా తెలిపారు. అలాగే గంజాయిని కార్లలో తరలిస్తున్న పది మంది నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందన్నారు.