Sep 13,2023 20:54

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణాపై నిరంతర నిఘా పెట్టి అల్లూరి జిల్లా ఎస్‌పి తుహిన్‌ సిన్హా వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023లో జిల్లాలోగల వివిధ పోలీసు స్టేషన్లలో 153 గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. 12,307 కిలోల గంజాయిని, 9.5 కిలోల ఆశీస్‌ ఆయిల్‌ను సీజ్‌ చేశామని, ఆయా కేసులకు సంబంధించి 524 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి తరుచూ నేరాలకు పాల్పడుతూ పలు కేసుల్లో ఉన్న 51 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించామన్నారు. ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో 8937 ఎకరాలలో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి తోటలను మూడేళ్ల కాలంలో గుర్తించి ధ్వంసం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి సాగు, రవాణా ఎక్కువగా సాగుతోందని, దీనిని అరికేట్టేందుకు జిల్లా పోలీసులు, ఒడిశా పోలీసులు మరింత సమన్వయంలో పనిచేయాల్సి ఉందని చెప్పారు.