
ప్రజాశక్తి-నెల్లూరు :గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-1 అడిషనల్ ఎస్‌పి హిమవతి మీడియాకు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం, కావలి, కలిగిరిలో గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. అన్నమయ్య జిల్లా, పుల్లంపేట ప్రాంతానికి చెందిన కె.నాగేంద్ర, అదే ప్రాంతానికి చెందిన కె.హరికృష్ణ, పలమనేరు, కాకుతోపు ప్రాంతానికి చెందిన షేక్ సలీంబాషా, పూతలపట్టు, బండాపల్లి ప్రాంతానికి చెందిన కె.భాస్కర్, తమిళనాడు రాష్ట్రం నమ్మకల్లు జిల్లాకు చెందిన మురుగేషన్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 40 కేజీల గంజాయి, రూ.95 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు నేరచరిత్ర కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.