
విజయవాడ: బెజవాడలో భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. వన్‌టౌన్, గొల్లపూడిలోని హౌల్‌సేల్ మందుల దుకాణాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాసవీ ఫార్మా కాంప్లెక్స్‌లో జరిపిన తనిఖీల్లో రూ.లక్షల విలువ చేసే నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.హోల్‌సేల్ వ్యాపారులు బిల్లులు లేకుండా హైదరాబాద్ నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో విక్రయిస్తున్నారు. వీటిలో గుండె సంబంధిత వ్యాధులకు వినియోగించే ఔషధాలు సైతం ఉన్నాయని సమాచారం. ఔషధాల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపారు. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణలో భారీగా నకిలీ మందుల రాకెట్ బయటపడింది. ఈ సమాచారంతో అధికారులు రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, నెల్లూరు సహా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఇద్దరిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఫిర్యాదు చేయడంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.