Oct 26,2023 07:48
  • ఇజ్రాయిల్‌ యుద్ధం సాకుతో సోషల్‌ మీడియాలో సాగుతున్న విష ప్రచారం

ముంబయి : ఇజ్రాయిల్‌-హమస్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా తీసుకుని ఇస్లామోఫోబియాను రెచ్చగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. భారత్‌లోనే వందలాది గాజా స్ట్రిప్‌లు వున్నాయని, హమస్‌ తరహాలో ఇస్లామిస్ట్‌ దాడులను హిందువులు ఎదుర్కొనే ప్రమాదముందని, అదే జరిగితే వాటి నుండి భారత్‌ను కాపాడగలిగేది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనని బిజెపి అనుకూల మితవాద ఆన్‌లైన్‌ విభాగాలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌-హమస్‌ యుద్ధం ముసుగులో తప్పుడు సమాచారంతో బిజెపి ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
బిజెపి నేతల పేర్లతో ప్రొ బిజెపి వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ పేజీలు, గ్రూపుల్లో సోషల్‌ మీడియా యూజర్లు తమ హిందూత్వ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ యుద్ధాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. ముస్లింలే ప్రధాన లక్ష్యంగా తమ తుపాకులను ఎక్కుపెడుతున్నారు.
ఫోటోలు, వీడియోలు ఉపయోగిస్తూ, మెసేజ్‌లు పెడుతూ ఈ గ్రూపుల్లో ఇస్లామ్‌, ముస్లింలే ప్రధానంగా ఈ యుద్ధానికి కారకులంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, పాలస్తీనియన్లను జిహాదీలు, తీవ్రవాదులుగా చిత్రీకరించడం ద్వారా వారు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను అమానవీయంగా చూపిస్తున్నారు.
అక్టోబరు 7న దాడులు ప్రారంభమైనప్పటి నుండి 1400మంది ఇజ్రాయిలీలు, దాదాపు 6500 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనియన్‌ మృతుల్లో 2300 మంది చిన్నారులు వున్నారు. పైగా వీరి మరణాలపై గ్రూపుల్లో జోకులు పేలుస్తున్నారు. వారి ఇబ్బందులు, కష్టాలను అపహాస్యం చేసేలానే ఈ జోకులు వుండడమనేది సర్వసాధారణంగా వుంది.

  • కొన్నేళ్లుగా ఇదే ధోరణి : ప్రతీక్‌

ఇంటర్‌నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ పాలసీ డైరెక్టర్‌ ప్రతీక్‌ వాఘ్రే మాట్లాడుతూ, భారతీయ మితవాద వర్గాల్లో ఇటువంటి విస్తృత ధోరణికి సంబంధించిన ప్రచారంలో భాగమే ఈ పోస్టులని వ్యాఖ్యానించారు. ''అత్యధికంగా ముస్లింలను అప్పుడప్పుడు ఆధునిక హిందువులను శత్రువుగా లేదా ముప్పుగా చూపించేలా అంతర్జాతీయ సంఘటనలను చొప్పించేటువంటి కచ్చితమైన ధోరణి భారత్‌లో గత కొన్నేళ్ళుగా నెలకొంది.'' అని ఆయన పేర్కొన్నారు. యూదు రాజ్యమైన ఇజ్రాయిల్‌, ముస్లింల ఆధిపత్యం కలిగిన పాలస్తీనా మధ్య ఘర్షణ యొక్క మతపరమైన కోణమే ఇందులో ప్రధానంగా వుంటుందని అన్నారు.

  • విద్వేష గ్రూపులన్నీ కాషాయ మూలాలున్నవే..

ఇజ్రాయిల్‌ - హమస్‌ మధ్య దాడులకు సంబంధించి మన దేశంలో సామాజిక మాధ్యమాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్న 13 గ్రూపులకు సంబంధించిన సమాచారం విశ్లేషించగా..ఈ గ్రూపులన్నీ కూడా చాలా స్పష్టంగా హిందూత్వ భావజాలానికి, బిజెపి, నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు స్పష్టమైన మద్దతునిస్తున్నాయి. వాట్సాప్‌ గ్రూపుల పేర్లు, ఆలాగే డిస్‌ప్లే ఫోటోలు సాధారణంగా మోడీ, ఆదిత్యనాథ్‌ ఫోటోలు ద్వారా ఆ మద్దతనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ గ్రూపుల్లో సభ్యుల సంఖ్య దాదాపు 50 నుండి 400 వరకు వుంటోంది. దీనికి తోడు, పలు ఫేస్‌బుక్‌ పేజీలు, గ్రూపులు కూడా వున్నాయి. అవి కూడా బిజెపి, ఆ పార్టీ నేతలతో గల సంబంధాలను బాహటంగానే ప్రదర్శిస్తున్నాయి.

  • నాలుగు లక్ష్యాలు

ప్రధానంగా నాలుగు థీమ్స్‌తో ఈ గ్రూపులు సాగించే ప్రచారం వుంటోంది. అవి -పాలస్తీనియన్ల ఇబ్బందులను అమానవీయంగా చిత్రీకరించడం, వారికి మద్దతివ్వడాన్ని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడం, ఇజ్రాయిల్‌-గాజా యుద్ధానికి చారిత్రక భారతీయ పోలికలను తీసుకురావడం, ఇస్లామిస్ట్‌ దాడి గురించి హిందువులను హెచ్చరించడం, దీనిపై పోరాడే సమర్ధత బిజెపి, మోడీలకే వుందని ప్రచారం చేయడం - గా వున్నాయి.
శ్రీ ఇజ్రాయిలీల దుస్థితిని కాశ్మీరీ హిందువులతో పోలుస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. హమస్‌ చెరలో వున్న ఇజ్రాయిల్‌ కుటుంబానికి సంబంధించిన వీడియో ఒకటి వ్యాప్తి చేస్తూ, దాని కింద 'వారి ముఖాల్లో భయాన్ని చూడండి, 1990లో కాశ్మీరీ హిందువుల ముఖాల్లో నెలకొన్న భయమే కనిపిస్తోంది.' అంటూ పోస్టు పెడుతున్నారు. 'భారతీయులు దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారమని పిలుస్తారు. వాస్తవానికి ఇస్లామ్‌ శాంతిని ప్రేమించే మతం' అంటూ వ్యంగంగా ఆ పోస్టు కింద వ్యాఖ్యానిస్తారు. దానితో వారనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. హమస్‌ను హుమయూన్‌, బాబర్‌ వంటి 'ఇస్లామిక్‌ ఆక్రమణదారుల'తో పోలుస్తారు.

  • యోగి ఆదిత్యనాథ్‌ ఫర్‌ పిఎం 2024 పేరుతో ఒక ఫేస్‌బుక్‌ పేజీ వుంది. దీనికి 66వేల మంది ఫాలోయర్లు వున్నారు. ''హిందూ మహిళలు ఎందుకు ఆత్మాహుతికి పాల్పడ్డారో హమస్‌ మనకు అర్ధమయ్యేలా చేస్తోంది.'' అంటూ ఆ పేజి అడ్మినిస్ట్రేటర్‌ పోస్టు పెట్టారు.
  • ఇజ్రాయిల్‌ యుద్ధం మనకు సంబంధించినదే అని ఈ గ్రూపులు మనల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాయి. భారతీయులపై ముఖ్యంగా హిందువులపై ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులు తక్షణమే దాడులు జరుపుతారంటూ భయాందోళనలు రెచ్చగొట్టేలా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇజ్రాయిల్‌ మాదిరిగా భారత్‌లో కూడా భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు జరుగుతాయని హెచ్చరిస్తారు. హిందూ మహిళలపై దారుణాలు, అకృత్యాలు జరిగే అవకాశం లేకపోలేదంటూ హెచ్చరిస్తున్నారు. అందువల్ల హిందువులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందంటూ స్పష్టం చేసేలా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా రెండు విషయాలను గుర్తు పెట్టుకోవాలని, ఆయుధాలు ధరించాలని, ముస్లింలను పూర్తిగా సామాజికంగా బహిష్కరించాలని పిలుపిస్తున్నారు.
  • హమస్‌ దాడులకు కాంగ్రెస్‌ను నిందిస్తూ కూడా వాట్సాప్‌ల్లో చాలా మెసేజ్‌లు కనిపిస్తున్నాయి. మరోవైపు నాథూరాం గాడ్సేను పొగుడుతూ సందేశాలు వస్తున్నాయి. గాడ్సే, మహాత్మా గాంధీని హత్య చేయకపోతే భారత్‌లో 3 వేల కిలోమీటర్ల పొడవునా గాజా స్ట్రిప్‌ ఏర్పడి వుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.
  • పాలస్తీనియన్లకు మద్దతివ్వడాన్ని అక్రమంగా, చట్టవిరుద్ధంగా పేర్కొంటున్నారు. పాలస్తీనియన్లకు మద్దతిచ్చే వారిని పాములుగా అభివర్ణిస్తున్నారు. భారత్‌లో అటువంటి పాములకు కొదవే లేదని పేర్కొంటున్నారు.
  • ఈ పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యానాల మూల ప్రయోజనం ఒక్కటిగానే వుంటోంది. వీటన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే వ్యక్తి బిజెపి నేత మోడీ అని నేరుగా పేరు పెట్టి చెప్పకుండా బలవంతుడైన నాయకుడిని ఎన్నుకోవాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.