Nov 10,2023 15:19

జెనీవా :   ఇజ్రాయిల్‌ యుద్ధం కొనసాగితే పాలస్తీనాలో పేదరికం గణనీయంగా పెరుగుతుందని ఐరాస పేర్కొంది.   రెండవ నెల కూడా గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగితే పాలస్తీనాలో పేదరికం రేటు 34 శాతానికి చేరుకుంటుందని తెలిపింది.  అక్టోబర్ 7 నుండి ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఐరాస డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) మరియు ఎకనామిక్‌, సోషల్‌ కమిషన్‌ ఫర్‌ పశ్చిమ ఆసియా (ఇఎస్‌సిడబ్ల్యుఎ) సంయుక్తంగా గురువారం ఓ నివేదికను విడుదల చేశాయి. '' గాజా యుద్ధం : పాలస్తీనాపై సామాజిక - ఆర్థిక ప్రభావం '' పేరుతో విడుదలైన ఈనివేదికలో పలు అంశాలను చర్చించాయి.

34 శాతం దాదాపు ఐదు లక్షలకు పైగా పాలస్తీనియన్లు పేదరికంలోకి వెళతారని తెలిపింది. పాలస్తీనా జిడిపి 8.4 శాతానికి క్షీణిస్తుందని, 1.7 బిలియన్‌ అమెరికా డాలర్ల నష్టమని యుఎన్‌డిపి, ఇఎస్‌సిడబ్ల్యుఎ అంచనా వేశాయి. నెలరోజుల యుద్ధం ప్రభావంతో . పేదరికం రేటు 20 శాతం పెరగగా, ఆర్థిక వృద్ధి రేటు 4.2 శాతం క్షీణించిందని సూచించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నివేదిక ప్రకారం.. ఈ సమయంలోనే 3,90,000 ఉద్యోగాలను కోల్పోయారని పేర్కొంది.

యుద్ధం మూడవ నెలకు చేరితే.. పేదరికం 45 శాతానికి చేరుతుందని, దీంతో 6,60,000 మంది పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించింది. అదే సమయంలో జిడిపి 12.2 శాతానికి పడిపోగా, మొత్తం 2.5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నష్టం ఏర్పడవచ్చని అంచనా వేశాయి మానవఅభివృద్ధి సూచిలో గణనీయమైన క్షీణత కనిపిస్తుందని హెచ్చరించింది. యుద్ధం తీవ్రతను అనుసరించి పాలస్తీనాలో అభివృద్ధి 11 నుండి 16 సంవత్సరాల వెనక్కు, గాజాలో 16 నుండి 19 సంవత్సరాల వెనక్కు చేరుతుందని హెచ్చరించింది.
అక్టోబర్‌ 7 నుండి సుమారు 1.5 మిలియన్ల మంది నిరాశ్రయులవగా, భారీగా నివాసాలు, మౌలిక సదుపాయాల నష్టం ఏర్పడిందని నివేదిక పేర్కొంది. ఆర్థికమాంద్యం విపత్తు మానవతా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని మరియు రికవరీ అవకాశాలు సవాలుగా మారతాయని తెలిపింది.