యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల శాఖలో బోధన, పరిశోధనా రంగాల్లో అంకితభావం కలిగిన సార్థక ఆచార్యుడు డాక్టర్ మూల మల్లికార్జున రెడ్డి. రాయలసీమలో గత 50 ఏళ్ళుగా పద్య నాటక జైత్రయాత్రలే తప్ప సాంఘిక నాటక ప్రదర్శనలు వేళ్ళ మీద లెక్కింపగలిగినంత స్వల్పం అనుకుంటున్నప్పుడు, ఆయన తన అవిశ్రాంత శోధనా పటిమతో తన పరిశోధన అధ్యయన గ్రంథాన్ని యుజిసి వారికి సమర్పించేనాటికి 500 పైగా పౌరాణిక, చారిత్రక, సాంఘిక, అనువాద నాటకాలు, నాటికలు, ఏకాంకికలను సేకరించారు. ఇంకా అధ్యయనం చేయాల్సిన మరో 500 నాటకాల జాబితాను చూపించారు. ఇలా ఆయన సీమలో నాటకరంగ విశాలమైన పరిధులను పరికింపజేసి ఆశ్చర్యానంద చకితులను చేశారు.
బాల్యం నుంచి పౌరాణిక, చారిత్రక నాటకాలు అంటే ఇష్టం చూపిస్తూ... సాంఘిక నాటకాల పట్ల అంత ఆసక్తిని చూపించని డాక్టర్ మూలకు ... 2015లో నంది నాటక విభాగాల్లో పిల్లల నాటికలకు ప్రాథమిక పరిశీలకుడిగా పనిచేసిన సందర్భంలో, సాంఘిక నాటకం శక్తి సామర్థ్యాలు, సామాజిక ప్రయోజనం వగైరాలు అనుభవంలోకి వచ్చాయి. పరిశోధనలో భాగంగా రాయలసీమ అంతటా తిరుగుతూ 500 పైగా అన్ని రకాల నాటకాలను సేకరిస్తూ, అధ్యయనం చేస్తున్న సందర్భంలో తనలోని నటుడిని, నాటక రచయితను గమనించి, ఆ లక్షణాలను మరింత పదును దిద్దుకున్నారు. పరిశోధనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యం-500 నాటకాల సేకరణ. కానీ, రాతప్రతులు, అచ్చు పుస్తకాలు, ప్రదర్శనలు చూస్తూ, తెలుసుకుంటూ మరో 500 నాటకాల సూచి ప్రకటించగలిగారు. ఆయన పడ్డ కష్టం- పరిశోధనలో నూతన అధ్యాయాన్ని సష్టించింది.
ఆ కృషిని పుస్తక రూపంలో చూసిన పెద్దలందరూ మిగిలిన, తాను సేకరించి పెట్టిన, మరో 500 నాటకాలను కూడా శోధించి గ్రంథస్థం చేయమని, చేయగల సత్తా సామర్థ్యాలు డాక్టర్ మూలలో ఉన్నాయన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీనినిబట్టే అర్థమవుతుంది.. రాయలసీమ నాటకరంగ పరిశోధనా మూలస్తంభంగా డాక్టర్ మూల చరిత్రలో నిలిచిపోతాడని. 'తినగ తినగ వేము తీయనుండు' అన్నట్టుగా తన పరిశోధనా గ్రంథం ముగించిన సమయానికి, ఆయనలో సాంఘిక నాటికలు, నాటిక రచనపై మమకారం, ఆసక్తి ఆత్మవిశ్వాసం మెండుగా పొటమరించాయి. మనః పూర్వకంగా చేసిన పని సత్ఫలితాలను ఉత్తమ ప్రయోజనాల్ని సంతరింప చేయకుండా పోతుందా? ఇదిగో... అలాంటి దీక్షాంత ఫలితమే 'యమసభ' (నాలుగు) నాటికల సంపుటి ప్రచురణ.
డాక్టర్ మూల స్వతహాగా హాస్య ప్రియుడు, కార్యశీలి, కార్యసాధకుడు. ఒకప్పటి సాంఘిక నాటకాలు అంటే తనకున్న విముఖత దశ నుంచి సాంఘిక నాటికల పౌరాణిక పాత్రధారణతో పాటు అంతకుమించి నాటికల రచయితగా వెలుగులోకి, ప్రసిద్ధిలోకి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. తన పది వేళ్ళ మధ్య వేయి నాటక ప్రతులను పరిశీలించిన అనుభవంతో, ఈ నాలుగు నాటికలను రచించారు. ఈ నాలుగూ నూటికి నూరుపాళ్ళు సామాజిక ప్రయోజనంతో పాటు ప్రహసనం, అధిక్షేపం, వ్యంగ్యం, హాస్యం, సామెతలు, లోకోక్తులు, నానుడులు, పలుకుబడులు అనాయాసంగా వాటి ఇతివత్తాల్లో, కథాకథనంలో చోటుచేసుకున్నాయి. ఇంకా ప్రశంసించదగ్గ విషయం ఏమంటే తన నాటికలను ఒక విమర్శకుడిగా నిష్పక్షపాత దృష్టితో, స్వీయ రచనా వ్యామోహంలో పడకుండా, పరిశీలించుకుని ప్రదర్శనాపరంగా ఉన్న కొన్ని లోపాల్ని సవరించుకొని దోషరహితంగా ప్రక్షాళన చేసుకోవడం.
'యమసభ' అంటేనే ఆధునిక ప్రేక్షకుడికి కావలసినంత వినోదం దొరుకుతుందని ఆశ పడతాడు. అంతకుమించి అందులో.. దేశం పట్ల గౌరవం, వైద్య వృత్తి పట్ల ఆదరం, వృత్తిపరమైన నిజాయితీ, మానవ ప్రేమ - సేవ సహానుభూతులకు భిన్నంగా, డబ్బే సర్వస్వంగా పాకులాడే కొందరు వైద్యుల తీరుతెన్నులను నిర్భయంగా చీల్చి చెండాడారు డాక్టర్ మూల. పనిలో పనిగా మాతృభాష పట్ల ప్రేమ లేకపోవడం, కని పెంచిన తల్లిదండ్రులపై ప్రేమ రాహిత్యం, రాజకీయ నేతల వికృత చేష్టలు, చరవాణి విశృంఖలత్వం, అది తెచ్చి పెడుతున్న అనర్థాలను దృశ్యమానం చేశారు. 'నిత్యశంకితులు' నాటికలో మూఢ అంధవిశ్వాసాలను ఎండగడుతూ శాస్త్రీయ, సహేతుక దృక్పథాన్ని అలవర్చుకోవల్సిన అవసరాన్ని బలంగా చెప్పారు. 'అనురాగ స్పర్శ' నాటికలో ఆడపిల్లల పట్ల కొందరు వివక్షగల తండ్రులకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం. 'వ్యసనం' నాటికలో దాని పర్యావసానాల్ని.. వ్యసనపరుల దుశ్చర్యలు, వయస్సు పైబడిన వారు ఆదర్శప్రాయంగా నడుచుకోవల్సిన తీరు- బొమ్మా బొరుసులా చాకచక్యంగా రచన నడిపించారు. 'విలువలు మారుతున్నారు' నాటికలో కీర్తిశేషులు వైజీ ప్రకాష్ అన్నట్లు - ఈ నాలుగింటిలోనూ ఒకో రకమైన ప్రత్యేకత- తొణికిసలాడే హాస్యం, సందర్భానికి తగిన శక్తివంతమైన సంభాణలు, మనుషుల్లోని చిత్ర విచిత్ర తత్వాలను కాచి వడబోసి, తన రచనా నికషోఫలంగా డాక్టర్ మూల తీర్చిదిద్దారు.
''నాటకానికి సంఘర్షణ ప్రాణం. ఈ సంఘర్షణ బహిర్గతంగాను అంతర్గతంగాను ఉంటుంది. మానవ మనో లోకాల్లో జరిగే అంతః సంఘర్షణను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ఆధునిక తెలుగు నాటక సాహిత్యం'' అంటారు డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్. అందుకు తాజా ఉదాహరణగా 'యమసభ' సంపుటిలోని నాలుగు నాటికలూ నిలుస్తాయి. ''సమాజంలోని మూఢ నమ్మకాలను నిరసించి, దురాచారాలను ఖండించి దోషాలను తిరస్కరించి సద్గుణాలను ప్రోత్సహించడంలో నాటకానికి గొప్ప ప్రాధాన్యత ఉంది'' అని తెలుగు నాటక తొలి ప్రయోక్త కందుకూరి వీరేశలింగం అన్నారు. అలాంటి ఉదాత్త ఆశయంతో ఈనాటి నాటక రచయితలు అడుగులు వేస్తున్నారనడానికి అక్షర సాక్ష్యాలు డాక్టర్ మూల నాటికలు.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655










