ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భూముల రీసర్వే పూర్తయి, రెవెన్యూ రికార్డులు నూరు శాతం తయారైన 2 వేల గ్రామాలు, వార్డుల్లోని ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ ఇక సులభతరం కానుంది. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (ఆర్‌ఒ) లేక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే క్రయ, విక్రయాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుండేది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోనే పౌరసేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై ఆయా గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలందించనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 (1908 యాక్ట్ నెంబరు 16)లోని సెక్షన్ 7 సబ్ సెక్షన్(1) కింద అందించబడిన అధికారాలను అమలు చేయడంలో ఇతర నోటిఫికేషన్‌లను పాక్షికంగా సవరించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇందు కోసం పంచాయతీరాజ్ కమిషనరు, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టరు, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనరుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపింది.