Aug 29,2023 14:31

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : ఓట్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని వెంకటరాజంపేట 189 పీఎస్‌ కు సంబంధించి సుమారు 742 ఓట్లు ఉన్నాయని, అయితే పక్క గ్రామమైన ఊటుకూరు ఓటర్లను ఈపీఎస్‌లో నమోదు చేసి తారుమారు చేయడం జరిగిందని ఆరోపించారు. సీరియల్‌ నెంబర్‌ 524, 525 నంబర్లకు సంబంధించి లవిడి రమణ, సూరపు రాజు రమేష్‌ కుమార్‌ రాజు ల ఓట్లు తారుమారు చేసి 189 పి ఎస్‌ లో నమోదు చేయడం జరిగిందని వివరించారు. ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి దొంగ ఓట్లు ఎక్కించారని గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. నియోజకవర్గంలోని ఒక పిఎస్‌ లోనే పక్క గ్రామం ఓట్లు నమోదు చేశారంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల దొంగ ఓట్లు నమోదై ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. దీనిపైన ఎన్నికల కమిషన్‌ స్పందించి ఓట్లు తారుమారు కాకుండా, దొంగ ఓట్లు నమోదు కాకుండా సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.