- సోషల్ మీడియాను ఉపయోగించుకున్న ఆర్మీ
- అయినా చర్యలకు వెనకాడిన మెటా ఇండియా
వాషింగ్టన్ : కాశ్మీర్‌లో సైన్యం నేతృత్వంలో ఏడాది పాటు సాగిన తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవడంలో మెటా భారత్ బృందం తీవ్ర అలసత్వం వహించిందని 'వాషింగ్టన్ పోస్ట్' పత్రిక తాజాగా వెల్లడించింది. కంపెనీలోని మాజీ ఉద్యోగులను ఉటంకిస్తూ ఈ విషయం తెలిపింది. భారత సైనికాధికారులు ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రతినిధులను కలుసుకుని, పాకిస్తాన్ సాగించే తప్పుడు సమాచారం నెట్‌వర్క్‌లకు ప్రతిగా తాము ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు పేర్కొంటూ తమ చర్యను సమర్ధించుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ తన వార్తా కథనంలో తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైన్యం చినార్ కార్ప్స్ నేతృత్వంలో ఏడాది పాటు సైన్యం తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేశాయని, అయినా వాటిపై ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారత బృందం చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆ వార్తా కథనం పేర్కొంది. జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ పెట్టిన పోస్టు కాశ్మీరీ జర్నలిస్టులను ప్రమాదంలో పడేసే తప్పుడు సమాచారమని ఆ నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో కృత్రిమంగా సందేశాలను పంపేలా నకిలీ ప్రొఫైల్స్, ఖాతాల నెట్‌వర్క్‌ను ప్రారంభించారంటూ మెటాకి చెందిన కోఆర్డినేటెడ్ ఇన్ ఆథెంటిక్ బిహేవియర్ (సిఐబి) బృంద సభ్యులను ఆ నివేదిక ఉటంకించింది. ఆర్మీ అధికారులు ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రతినిధులను కలసి ఈ సైనిక చర్యను బలపరచాలని కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. చినార్ కార్ప్స్ చేపట్టిన ఆపరేషన్ గురించి ఫేస్‌బుక్‌కు చెందినకో-ఆర్డినేటెడ్ ఇనాథెంటిక్ బిహేవియర్ ( సిఐబి) సభ్యులు భారత్‌లోని మెటా సిబ్బందిని హెచ్చరించినట్లు ఆ నివేదిక తెలిపింది. ''తన నియంత్రణలోని భూభాగంలో సార్వభౌమాధి కార ప్రభుత్వం తీసుకునే చర్యలను వ్యతిరేకించరాదు.'' అంటూ హెచ్చరించింది. పైగా స్థానిక ఉద్యోగులను దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్టే ప్రమాదముందంటూ ఆందోళన వ్యక్తం చేసిందని వాషింగ్టన్ పోస్ట్ తన వార్తా కథనంలో పేర్కొంది. శ్రీనగర్ ప్రధానకేంద్రంగా పనిచేసే మీడియా సంస్థ ది కాశ్మీరియత్, దాని సంపాదకుడు క్వాజి షిబ్లిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో విస్తరించి వున్న కంపెనీగా, తాము మరింత సంక్లిష్టమవుతున్న వాతావరణంలో పనిచేస్తున్నామని, అయినా, ఆయా ప్రాంతాల్లో వర్తించే చట్టాలు, మానవ హక్కుల నిబంధనలకు అనుగుణంగా వుండేలా తమ ఉద్యోగుల భద్రతకు హామీ కల్పిస్తూ తమ సేవలను ఉపయోగించుకునే వారి భద్రతపై కూడా దృష్టి పెడతామని మెటా ఒక ప్రకటనలో పేర్కొంది. తమ వేదికలపై సిఐబిని నిషేధించామని తెలిపింది.
సోషల్ మీడియా సంస్థ భారత్‌లో ఈ విధంగా తప్పుడు ప్రచార నెట్‌వర్కులను తమ వేదికలపై అనుమతించడం ఇదే మొదటిసారి కాదు. 2020 లోనూ ఇలానే జరిగింది. తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే టి రాజాసింగ్ మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా వలసవాసులను తరిమేయాలంటూ సోషల్ మీడియా వేదికగా విషం వెళ్లగక్కితే అప్పుడూ మెటా భారత బృందం చేష్టలుడిగినట్లు వ్యవహరించింది.