Sep 17,2023 06:54

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు కేంద్రంగా నకిలీ బయో ఉత్పత్తుల తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇజ్రాయిల్‌ నుంచి ముడిసరుకు తెప్పించి నకిలీ సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు తయారు చేసి విక్రయిస్తున్నారు. దీంతో, రైతులు నష్టపోతున్నారు. బయో ఉత్పత్తుల్లో కీలకమైన కెమికల్స్‌ అన్నీ ఇజ్రాయిల్‌ నుంచి గుంటూరు తెప్పించి పలువురు వీటిని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని హైదరాబాద్‌ పరిసరాల్లో కొన్ని కంపెనీలు బయో ఉత్పత్తులకు లైసెన్సులు పొంది అనుబంధ తయారీ కేంద్రాలను గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అనధికారికంగా ఏర్పాటు చేస్తున్నాయి. దీనిపై ఇటీవల కాలంలో గుంటూరు విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండు నెలల కాలంలో రూ.ఏడు కోట్ల విలువైన బయో ఉత్పత్తులు, ముడిసరుకును విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎటువంటి అనుమతులూ లేవని, ఎక్కడో ఒకచోట అనుమతి తీసుకుని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విక్రయిస్తున్నారని గుంటూరు ఉమ్మడి జిల్లా విజిలెన్సు ఎస్‌పి కె.ఈశ్వరరావు 'ప్రజాశక్తి'కి తెలిపారు. కాలం చెల్లిన ఉత్పత్తులకు ప్యాకింగ్‌ మార్చి తిరిగి కొత్త గడువు తేదీని ముద్రించి పలు దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో ఐదు కోట్ల రూపాయల విలువైన బయో ఉత్పత్తులు, ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజుపాలెం, కర్లపాలెం మండలం యాజిలి, కంటెపూడి, యాజిలి, గుంటూరు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో మరో రూ.రెండు కోట్ల విలువైన ఉత్పత్తులను విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురిపై కేసులు నమోదు చేశారు. కాలం చెల్లిన బయో స్టిములేంట్స్‌ను కొత్త లేబుల్స్‌, స్టిక్కరింగ్‌ చేసిన బాటిల్స్‌లో అమ్ముతున్నట్లు, కొన్ని బ్రాండ్స్‌ బయో స్టిము లెంట్స్‌ను ప్రభుత్వ అనుమ తులు లేకుండా అక్రమంగా తయారు చేసి వాటిని అమ్మి రైతులను మోసగిస్తున్నట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖాది కారులు పట్టించుకోక పోవడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయో ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ ఉత్పత్తులు విక్రయిస్తే డీలర్లకు కూడా ఎక్కువ రాయితీలు, బహుమతులు ఆఫర్‌ చేస్తుండడంతో వారు వీటిని రైతులకు ఏదో రూపంలో రైతులకు అంటగడుతున్నారు. దేశంలో 47 రకాల బయో ఉత్పత్తులకు ఆయా రాష్ట్రాల్లో కంపెనీలకు అనుమతి ఉంది. అయితే, 90 కంపెనీల కు చెందిన 416 బయో ఉత్పత్తులు మార్కెట్లో చలామణిలో ఉన్నట్లు సమాచారం. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో వాణిజ్య పంటలు ఎక్కువగా పండించడం వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువగా ఉంటోంది. బయో ఉత్పత్తుల్లో ఎక్కువగా జిబ్రా లిక్‌ యాసిడ్‌ వల్ల పంట కాపు ఏపుగా పెరిగినా దిగుబడి రావడం లేదు. ఒక కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోగానే పేరు మార్చి పరిసరాల్లోనే మరో కంపెనీని ప్రారంభించడం బయో ఉత్పత్తుల తయారీదారులకు పరిపాటిగా మారింది.