మహిళలు ఎన్ని రంగాల్లో ఎంతగా రాణిస్తున్నా... ఇంకా అణచివేత కొనసాగుతూనే ఉంది. ప్రతి విషయంలోనూ ఆంక్షలు యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటప్పుడే ఇప్పుడు గ్రామదేవతలుగా వెలుగొందుతున్న ఒకనాటి వీరనారుల స్ఫూర్తి సమాజంలో రగలాలి. అన్యాయాన్ని అన్యాయమని చాటి, దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పే సామూహిక చేతన ముందుకు రావాలి. తిరుపతిలో ఇప్పుడు జరుగుతున్న గంగమ్మ జాతర నేపథ్యం ... స్త్రీ శక్తిని చాటే ఒక చారిత్రిక సందర్భం. చిత్తూరు జిల్లాలో ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించుకునే 'గంగమ్మ' జాతరలో కొలువై ఉన్న 'గంగమ్మ'ను అక్కడి ప్రజలు ఆదిశక్తిగా పూజిస్తారు. ఒకప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాలకు సామంతుడైన 'పాలెగాడు' పరిపాలించేవాడు. అతడు పరమ దుర్మార్గుడు.. ప్రజలను రాచిరంపాన పెట్టే రాక్షసుడు. మహిళల మానప్రాణాలను తీసేవాడు. వాణ్ణి వధించి కాపాడమని జనం ప్రార్థిస్తే, అప్పుడు గంగమ్మ తల్లి ప్రజల కల్పవల్లిగా వానిని తుద ముట్టించాలని నిర్ణయించింది. ఈ విషయం పాలెగాడికి తెలిసి, ఆ తల్లి కోపానికి జడిసి ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. తనను వాడు కనిపెట్టకుండా రోజుకో వేషం వేసి ఊరూరు తిరిగింది. చివరికి గంగమ్మ దొర వేషం వేసినప్పుడు పాలెగాడు తన రాజు వచ్చాడని భావించి బయటికి వస్తాడు. అప్పుడు వాడిని గంగమ్మ వధిస్తుంది. ఇది ప్రచారంలో ఉన్న కథ. అప్పటి నుంచి పాలెగాడి నుండి కాపాడిన గంగమ్మ తల్లికి గౌరవ సూచకంగా జాతరలో భక్తులు రకరకాల వేషాలు వేస్తుంటారు. బైరాగి వేషం, గారడి వేషం, రౌడీ వేషం, బండ వేషం, ఆడ వేషం ... ఇలా వేస్తూ జాతరను జరుపుకోవడం ఆనవాయితీ.

ఇప్పటికీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంటే ఎంతో ప్రత్యేకత. ప్రస్తుతం ఈ జాతర రాష్ట్రస్థాయి పండుగయింది.. వెంకటేశ్వరస్వామికి చెల్లిగా ఏటా సారె అందుకుంటున్న గంగమ్మ, ఈ ఏడాది ప్రతి ఇంటి నుంచి సారె అందుకునేందుకు సిద్ధమైంది. మొక్కులు తీర్చుకునేందుకు తిరుపతి ప్రజానీకం 'గంగమ్మ' వేషాలు వేసేందుకు సిద్ధమయ్యారు. చాటింపు ప్రక్రియతో ప్రారంభమైన ఈ జాతరలో ఈ ఏడాది ఆలయాన్ని పునర్నిర్మించి మహాకుంభాభిషేకం చేయడం ఓ విశిష్టత. మే 9 నుంచి 16 వ తేదీ వరకూ పెద్ద ఎత్తున గంగమ్మ జాతర జరగనుంది.

ఇదీ, వర్తమానం
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన రెజ్లర్లకు న్యాయం చేయకపోగా వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు ఇంతవరకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అత్యాచార దోషులకు బిజెపి మద్దతు ఇది మొదటిసారి కాదు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో బిజెపి ఎంఎల్‌ఎకు సపోర్టు చేసిందీ ప్రభుత్వం. కథువా రేప్ కేసు సంఘటనలోనూ దోషులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించింది. హత్రాస్ అత్యాచార ఘటనలో సాక్ష్యాలు దొరకకుండా చేసి రేపిస్టులను కాపాడింది. గోద్రా సంఘటనలో రేపిస్టు, హంతకులను విడుదల చేసి సత్కరించింది. ఈ పైత్యం పోకడలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తమిళనటుడు, దర్శకుడు భాగ్యరాజ్ 'మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో.. కట్టుబాట్లు ఉన్న కాలంలో అత్యాచారాలు జరిగేవి కాదని చెప్పుకొచ్చారు.

పితృస్వామ్య భావజాలం నరనరాన ఒంటబట్టించుకున్న సమాజంలో సాటి మహిళల్లో కొందరు అత్యాచార బాధితులకు అండగా నిలవకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. 50 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగితే 'ఇంట్లో నుంచి వెళ్లకపోతే బాగుండేది' అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా నిలవాల్సిన క్రీడాకారిణి పిటి ఉష కూడా వారిపై ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేప్‌లు చేయడం మన వేదాల్లోనే ఉందని, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని బిజెపికి చెందిన మహిళలే వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నపుడే పెళ్లిళ్లను నిశ్చయించాలని, అలాంటి బంధాలే దీర్ఘకాలం ఉంటాయని, వివాహానికి 18 ఏళ్ల వయసును చట్టబద్దం చేయడం ఓ వ్యాధి లాంటిదని, 18 ఏళ్లు రాగానే యువతులు పారిపోతున్నారని బిజెపి ఎంఎల్‌ఎ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్‌జీహాద్ లాంటి ఘటనలను నియంత్రించడానికి బాల్య వివాహాలను ప్రోత్సహించాలనీ పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో అత్యాచారం చేసిన నిందితుడు ఏ మూల దాగున్నా వెతికి మరీ నరికి చంపిన 'గంగమ్మ' మళ్లీ వస్తే బాగుండనిపిస్తోంది. ఈ పండుగ వాతావరణంలో ఆనాడు పాలెగాడిని వధించిన 'గంగమ్మ' తల్లి స్ఫూర్తి మరోసారి ప్రజల ముందుకు వచ్చి 'కీచకుల'కు బుద్ధి చెప్పాలన్న కోరిక బలంగా కలుగుతోంది.
- అవనిగడ్డ వనజ, తిరుపతి










