- పుంజులకు భారీగా పెరిగిన గిరాకీ
- బరుల ఏర్పాటుకు సిద్ధపడుతున్న నిర్వాహకులు !
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : సంక్రాంతి సమీపించడంతో జూదరులు కోడి పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చి పందెం పుంజులను తయారు చేశారు. ఇలా సిద్ధమైన పుంజుల కోసం జూదరులు పోటీపడుతున్నారు. మరో పక్క పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేసేందుకు నిర్వాహకులు అనువైన ప్రాంతాలను వెతుకుతున్నారు. కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, ఇతర జూదాలకు తెరలేపేందుకు సన్నద్ధం అవుతున్నారు. వాటిని అడ్డుకుంటామని పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తున్నా అనుమతుల కోసం నాయకులతో పైరవీలు ఇప్పటికే మొదలయ్యాయి.
రూ.600 కోట్లు పైనే...
సంక్రాంతి సమయంలో ఏటా రూ.600 కోట్ల వరకూ చేతులు మారుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాట్రేనికోన, ఐ.పోలవరం, అల్లవరం బరుల్లోనే రూ.300 కోట్లకు పైగా చేతులు మారుతుంటాయి. వీటితో పాటు రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం, రావులపాలెం, అంబాజీపేట, ఆత్రేయపురం మండలాలు, మెట్టప్రాంతంలో జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండాలాల్లో ఎక్కువగా కోడిపందేలను నిర్వహిస్తుంటారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఖాళీ ప్రాంతాలను సందర్శించారు. చిన్న, పెద్ద కలిపి మొత్తం 500 వరకూ బరులు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రణాళికలు రూపొందించారు.
మొదలైన బేరసారాలు
సంక్రాంతి పేరుతో వారం రోజులు పాటు కోడిపందాలు ఆడుకోవడానికి ఇప్పటినుంచే ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు బేరసారాలు మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బరుల్లో యథేచ్ఛÛగా పందేలు నిర్వహించుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోడి పందేలు జరిగినన్ని రోజులూ అటువైపు రాకుండా పోలీసులకు ముడుపులు అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పందేల నిర్వాహకులు ఆయా ప్రాంతాన్ని బట్టి ఒక్కో బరికి రూ.2లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ అధికార పార్టీ నేతలకు ముట్టజెప్పేలా రేట్లు మాట్లాడుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో హైవేను ఆనుకుని ఉన్న గండేపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో ఈ సారి రేట్లు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
చర్యలు తప్పవంటున్న పోలీసులు
సంప్రదాయం పేరుతో జూదాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి ఎం.రవీంద్రనాథ్‌బాబు ఇప్పటికే హెచ్చరించారు. కోడిపందేల అడ్డుకట్టుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద ప్రత్యేకంగా నిఘా ఉంచామని చెబుతున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా సర్కిళ్ల పరిధిలో సంప్రదాయ సంక్రాంతి పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆటోల ద్వారా వారు ప్రచారం చేస్తున్నారు.
ఐదు నెలల ముందు నుంచే శిక్షణ
సంక్రాంతి పండుగకు ఐదు నెలల ముందు నుంచే పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. వివిధ రకాల జాతుల కోడిపుంజులను రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేస్తారు. పుంజుల సంరక్షణకు ప్రత్యేకంగా ముగ్గురిని ఏర్పాటు చేస్తారు. పందానికి తయారయ్యే పుంజులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకుపైనే ఖర్చు చేస్తారు. ఇలా సిద్ధమైన ఒక్కో పుంజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. పందాలు వేసే కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కక్కురాయి, అబ్రాస్, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి. పందెపు కోళ్లను తయారు చేసే వారికి ప్యాకేజీల మాదిరిగా వేతనం ఇస్తారు. ఇది రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటుంది.










