న్యూడిల్లీ : దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దేశంలో వన్‌వెబ్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. ఈ సందర్బంగా ఆ సంస్థ అధినేత సునిల్ భారతి మిట్టల్ ఢిల్లీలో జరిగిన 7వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఇప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలోని ప్రతి అంగుళంలో సేవలు అందించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించామన్నారు. వచ్చే నెల నుంచి మెహసానా శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ నుంచి సేవలు అందుతాయని సునిల్ మిట్టల్ తెలిపారు. ప్రపంచ దేశాలకు కూడా మన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ చేరుకుంటోందన్నారు. జిఎస్‌ఎల్‌వి మాక్ 3 రాకెట్లను ఇస్రో ప్రయోగించిందని, ఆ రాకెట్ ద్వారా 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపామని, వన్‌వెబ్ కాన్‌స్టెల్లేషన్‌లోనూ భారతి కంపెనీ వాటా ఉందన్నారు. దీంతో ప్రపంచానికి సేవలు అందించడానికి రెడీగా ఉన్నామన్నారు.