Oct 05,2023 21:02

హైదరాబాద్‌ : విప్రో కేర్స్‌ సహకారంతో సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఏడవ ఎడిషన్‌ను ప్రారంభించామని విప్రో కన్య్సూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ప్రకటించింది. 12వ తరగతి, తత్సమాన విద్య అనంతరం ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరుకునే వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినీలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలోని విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 2016-17 నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతీ ఏడాది మద్దతును అందిస్తుంది. ఇంటర్మీడియట్‌ అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులకు ట్యూషన్‌, వసతి, ఇతర సంబంధిత ఖర్చుల కోసం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు, సంతూర్‌ ఉమెన్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 6000 పైగా మందికి స్కాలర్‌షిప్‌లను ఇవ్వగా.. ఈ ఏడాది 1900 స్కాలర్‌షిప్‌లను సంస్థ అందించనున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం సంతూర్‌స్కాలర్‌షిప్స్‌.కమ్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.