Sep 25,2023 08:31
  • విద్యార్ధులపై బలవంతంగా రుద్దేయత్నం
  • కేంద్రానికి లొంగి ఎన్‌ఇపి-2020 అమలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంస్కృతాన్ని విద్యార్ధులపై బలవంతంగా రుద్దడానికి రంగం సిద్ధమైంది. పాఠశాల విద్యలో మూడో భాషగా దీనిని అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ దాదాపు పూర్తిచేసింది. విద్యాశాఖ మంత్రి సంతకం చేయగానే మూడో భాషగా సంస్కృతం అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం(ఎన్‌ఇపి)-2020లో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు. సంస్కృతాన్ని బలవంతంగా రుద్దాలని కేంద్రం చేసిన ప్రయత్నాన్ని పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. కేంద్రప్రభుత్వం షరతులకు లొంగిన రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలపై చెత్తపన్ను వంటి భారాలు మోపింది. దేశాన్ని కాషాయికరణలో భాగంగా సంస్కృతం అమలు,చరిత్ర తొలగింపు అంశాలు ఎన్‌ఇపి-2020లో అంతర్లీనంగా ఉన్నాయి. ఎన్‌ఇపిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరగతుల విలీన ప్రక్రియ అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల ప్రవేశాలు తగ్గి కొన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఎన్‌ఇపిలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం సిబిఎస్‌ఇ సిలబస్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే 1100 పాఠశాలలను సిబిఎస్‌ఇగా మార్చింది. సిబిఎస్‌ఇ అమలు చేసే జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి(ఎన్‌సిఇఆర్‌టి) ఇటీవల కొంత సిలబస్‌ను తొలగించింది. డార్విన్‌ పరిణామా సిద్ధాంతం, మొగల్‌ చరిత్ర, ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధం, భగత్‌ సింగ్‌ చరిత్ర వంటి అంశాలను తొలగించింది. ఎన్‌సిఇఆర్‌టిలోని కొంత సిలబస్‌ను రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా మండలి(ఎస్‌సిఇఆర్‌టి) కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 9వ తరగతిలోని హిందీ సబ్జెక్టులో మొత్తం ఉత్తరభారత దేశ హిందీ మాండలికాలను ప్రవేశపెట్టి దక్షిణ భారతదేశ చరిత్రను హిందీ పాఠ్యాంశాల నుంచి ఎస్‌సిఇఆర్‌టి తొలగించింది. ఎన్‌ఇపిలో భాగంగా సంస్కృతాన్ని మొదటి భాషగా అమలు చేయాలని స్వరూపనంద స్వామి, చిన్నజీయర్‌ స్వామి వంటి హిందూ మఠాధిపతులు రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి చేశారని సమాచారం. మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేసిందని విద్యావేత్తలు, భాషాభిమానులు నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాడుకలో లేని సంస్కృత భాషను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్ధులకు అదనంగా ప్రయోజనం ఉండదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ఇప్పటికే బలవంతపు బోధన జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడో భాష కింద ఇంగ్లీష్‌ ఉంది. సంస్కృతాన్ని మూడో భాషగా అమలు చేస్తే ఇంగ్లీష్‌ను రెండో భాషగా చేస్తారా? లేదా మొదటి భాషగా అమలు చేస్తారా అనేది ప్రశార్ధకంగా మారనుంది. రెండో భాషగా ఉన్న హిందీని ఏం చేస్తారనేది మరో ప్రశ్న తలెత్తనుంది. భవిష్యత్తులో సంస్కృతాన్ని మొదటి భాషగా, ఇంగ్లీష్‌ను రెండో భాషగా, తెలుగును ఆప్షనల్‌ సబ్జెక్టుగా తీసుకొచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.