Oct 19,2022 09:48

చెన్నై : బలవంతంగా హిందీ అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు ఆచరణ సాధ్యం కాదని, హిందీయేతర భాషలపై వివక్ష చూపుతాయని తీర్మానం తెలిపింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీర్మానాన్ని చదివి వినిపించారు. 'రాష్ట్రపతికి అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న సమర్పించిన నివేదికలోని సిఫార్సులు అమలు చేయవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సిఫార్సులన్నీ తమిళంతో సహా ప్రాంతీయ భాషలు మాట్లాడే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. సిఫార్సులన్నీ భారత ప్రథమ ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చిన, రాష్ట్రాలు అమలు చేస్తున్నా రెండు భాషల విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి' అని తీర్మానం తెలిపింది.