Nov 09,2022 12:27
  • సదృశ్య సహితంగా ఆర్కైవ్‌ ఏర్పాటు
  • కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికలో వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా 576 భాషలు, మాండలికాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా కేంద్ర హోంశాఖ చేపట్టిన సర్వే పూర్తి అయింది. 'మదర్‌ లాంగ్వేజ్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎంటిఎస్‌ఐ)' పేరిట చేపట్టిన ప్రాజెక్టు వివరాలపై హోంశాఖ వార్షిక నివేదికలో ప్రత్యేకంగా వివరించారు. మాతృభాషల్లోని మమకారాన్ని, నుడికారాన్ని పరిరక్షించడానికి నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసి)లో వెబ్‌ ఆర్కైవ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఇప్పటికే ఆయా భాషలకు సంబంధించిన ఆడియో, వీడియోలతో సచిత్ర, సదృశ్యంగా రూపొందించిన డేటాను నిక్షిప్తం చేసి పరిశోధనలకు, విశ్లేషణలకు వినియోగిస్తామని తెలిపింది. వీటిని ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.
 

                                                         వార్షిక నివేదికలో మరికొన్ని కీలక అంశాలు..

  • కోవిడ్‌ రెండో వేవ్‌లో ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తన నివేదికలో అంగీకరించింది. 'ఏప్రిల్‌ 2021 నుండి కోవిడ్‌ కేసులు పెరిగిపోవడంతో మెడికల్‌ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, ఇతర ప్రాణాధార మందుల డిమాండ్‌ పెరిగింది' అని నివేదిక పేర్కొంది.
  • జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఎ) 2022 మార్చి 31 నాటికి 438 కేసులను నమోదు చేసిందని నివేదిక పేర్కొంది. వాటిలో 349 కేసులకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు, 89 కేసుల్లో విచారణ ముగిసినట్లు, 83 కేసుల్లో శిక్షలు పడినట్లు పేర్కొంది. 42 సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా, 31 మంది తీవ్రవాదులుగా ప్రకటించినట్లు తెలిపింది.
  • 2013తో పోల్చితే 2021లో హింసాత్మక సంఘటనలు 1,136 నుండి 509 వరకు తగ్గాయని, 63 శాతం తగ్గినట్లు హౌం మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాలు 397 నుండి 147 వరకు తగ్గాయని, 55 శాతం తగ్గినట్లు తెలిపింది.
  • దేశంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్ర హోంశాఖ నివేదికలో స్పష్టమైంది. 2020లో దేశంలో 66,01,285 నేర ఘటనలు జరిగాయి. 2019 (385.5 నేర రేటు) కంటే 2020లో 487.8 శాతానికి పెరిగింది. హత్యలు 29,193, కిడ్నాప్‌, అపహరణ 84,805, మొత్తం హింసాత్మక నేరాలు 4,00,006 ఘటనలు జరిగాయి. చిన్నారులపై నేరాలు 1,28,531, ఎస్‌సిలపై 50,291, ఎస్‌టిలపై 8,272, వద్ధులపై 24,794 నేరాలు జరిగాయి. ఆర్థిక నేరాలు 1,45,754, సైబర్‌ క్రైం 50,035 ఘటనలు చోటు చేసుకున్నాయి.