- మూడవ కిస్తుపై స్పష్టత ఇవ్వని కేంద్రం
- దాంతో కౌల్దార్లకు రాష్ట్ర సర్కారు వాయిదా
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల పండగ సంక్రాంతికి ప్రభుత్వం అందించే రైతు భరోసా సహాయం అందట్లేదు. పెద్ద పండుగ దగ్గర పడుతున్నప్పటికీ అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలూ సంక్రాంతికి అన్నదాతలకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయంపై స్పష్టత ఇవ్వలేదు. ఏడాదికి మూడు విడతల్లో కేంద్రంతో కలుపుకొని 'వైఎస్‌ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్' పథకం కింద రూ.13,500 జమ చేస్తామని రాష్ట్ర సర్కారు చెప్పింది. ప్రతి ఏటా సంక్రాంతికి సొంత భూమి కలిగిన రైతులకు మూడవ కిస్తు రూ.2,000 కేంద్రం జమ చేస్తుందని, కౌలు రైతులకు రాష్ట్రం రూ.2,000 వేస్తుందని పేర్కొంది. పిఎం కిసాన్ మూడవ కిస్తు ఎప్పుడు జమ చేసేదీ కేంద్రం ఇప్పటికైతే వెల్లడించలేదు. దాంతో కౌలు రైతుల మూడవ కిస్తుపై రాష్ట్రం సైతం వెనుకంజ వేసింది. దాంతో సంక్రాంతికి అన్నదాతలకు భరోసా సాయం దక్కట్లేదు. కేంద్రం స్వంత భూమి కలిగిన రైతులకు సంక్రాంతికి మూడవ కిస్తు జమ చేసినా చేయకపోయినా గడచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు భరోసా జమ చేసింది.
స్వల్ప సాయమూ వాయిదా
రైతులు పంటలు పండించడానికి అయ్యే పెట్టుబడులతో, విపత్తు నష్టాలతో, గిట్టుబాటు ధరల నష్టాలతో పోల్చితే ప్రభుత్వాలు చేసే సహాయం నామమాత్రం కాగా దాన్నీ మూడు కిస్తుల్లో ఇస్తున్నాయి. పండక్కి ఇస్తామన్న మూడవ కిస్తు రూ.2 వేలను సైతం జమ చేయకుండా వాయిదా వేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. తెలుగునాట సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. అయినా ప్రభుత్వాలు చేస్తామన్న సహాయం వాయిదా వేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇస్తామన్న రూ.13,500 ఏడాదిలో మూడు విడతల్లో ఇస్తున్నారు. ఏప్రిల్-జులై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్-మార్చి కింద వర్గీకరించారు. తొలి కిస్తులో కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం 5,500 వెరశి 7,500 స్వంత భూమి కలిగిన వారికి ఇస్తున్నారు. రెండవ కిస్తు కేంద్రం 2 వేలు, రాష్ట్రం 2 వేలు జమ చేస్తున్నాయి. రెండవ కిస్తులోనే రాష్ట్రం తన నిధులతో కౌలు రైతులకు, అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఒఎఫ్‌ఆర్) రైతులకు, దేవాలయ భూముల కౌలు దారులకు ఒకేసారి రెండు కిస్తులూ కలిపి రూ.11,500 ఇస్తోంది. ఇక మూడవ కిస్తును కేంద్రం 2 వేల వంతున స్వంత భూమి కలిగిన రైతులకు ఇస్తోంది. మూడవ కిస్తులో స్వంత భూమి రైతులకు రాష్ట్రం ఇచ్చేదేమీ లేదు. కేవలం కౌలు, ఆర్‌ఒఎఫ్‌ఆర్, ఎండోమెంట్ రైతులకు రూ.2 వేలు ఇస్తోంది. ఈ మూడవ కిస్తును సంక్రాంతి ముందు ఇస్తామంది.
ఇచ్చేదే తక్కువ
సంక్రాంతి ముందు ఇచ్చే మూడవ కిస్తుకు రాష్ట్రం భరించే నిధులు స్వల్పం. లక్షలాదిగా కౌలు రైతులున్నా నిబంధనల వలన స్వల్ప సంఖ్యలోనే కార్డులు పొందుతున్నారు. వారిలోనూ కొంత మందే భరోసాకు ఎంపికవుతున్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్, ఎండోమెంట్ రైతులూ తక్కువే. సుమారు లక్ష మంది కౌలు రైతులు (సిసిఆర్‌సి), మరో 50-60 వేల మంది వరకు ఆర్‌ఒఎఫ్‌ఆర్, ఎండోమెంట్ రైతులు భరోసాకు అర్హులు. వారికి రూ.2 వేల చొప్పున జమ చేస్తే సర్కారు పెట్టుకోవాల్సింది రూ.30-40 కోట్లు మాత్రమే. కేంద్రం మొత్తానికే కౌల్దార్లకు పిఎం కిసాన్ సహాయం ఇవ్వట్లేదు. స్వంత భూమి దారులకే ఇస్తోంది. ఎలాగూ స్వంత భూమి సాగుదారులకు కేంద్రం సంక్రాంతికి సహాయం జమ చేయట్లేదు కనుక రాష్ట్ర సర్కారు కూడా తాను కౌలు దారులకు ఇవ్వాల్సిన సహాయాన్ని వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.










