Oct 05,2023 16:58

ప్రజాశక్తి-తణుకు రూరల్‌(పశ్చిమగోదావరి) : తణుకు పట్టణంలోని 150 పడకల జిల్లా ప్రభుత్వాసుపత్రి స్థాయి కనుగుణంగా 120 మంది పారిశుధ్య కార్మికులను నియమించాలని ఏపీ మెడికల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ తణుకు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్‌ చేశారు. గురువారం తణుకులో ప్రభుత్వాసుపత్రి వద్ద మెడికల్‌ కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ 40 పడకలగా వున్న తణుకు ఏరియా హాస్పిటల్‌ను జిల్లా ఆసుపత్రిగా మారుస్తూ 150 పడకలకు విస్తరించడం జరిగిందన్నారు. విస్తరణలో భాగంగా అనేక నూతన భవనాల నిర్మాణం జరిగినప్పటికీ 40 పడకలు ఆసుపత్రిగా వున్నప్పుడు నియమించిన 18 మంది పారిశుద్ధ్య కార్మికులతోనే నేటికీ పనులు చేయిస్తున్నారన్నారు. దీనితో కార్మికులపై తీవ్ర పనిభారం పెరిగిందన్నారు. పెరిగిన పనిభారంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.150 పడకల ఆసుపత్రి స్థాయికనుగుణంగా 120 మంది పారిశుధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారం తగ్గించాలని భీమారావు డిమాండ్‌ చేశారు. రెండు నెలల వేతన బకాయిలు చెల్లించాలని,549 జీవో ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ.16 వేలు,43 జీవో ప్రకారం సెక్యూరిటీ సిబ్బందికి రూ.12 వేలు వేతనాలు చెల్లించాలన్నారు.అలాగే ప్రతీ నెలా పే స్లిప్పులు ఇవ్వాలని పిఎఫ్‌ ప్రతీ నెలా సక్రమంగా జమ చేయాలని ఎంత జమ చేస్తున్నదీ ఎప్పటికప్పుడు పే స్లిప్పులు ద్వారా తెలపాలని భీమారావు కోరారు. ఈ నిరసనలో ఏపీ మెడికల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.వెంకటలక్ష్మి, వై.రత్నం, వి.సూరమ్మ, ఇ.హైమావతి, టి.భారతి, వెంకట రత్నం, పి.రేణుక, చోళ్ళ మంగమ్మ,, ఎం. బేబి, పి.విజయలక్ష్మి, డి.చిన్నా, ఎన్‌. చింతాలు, డి.సాయికుమారి, డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.