Sep 22,2023 22:05

స్పీకర్‌ పోడియం చుట్టుముట్టిన టిడిపి సభ్యులు
మార్షల్స్‌తో తోపులాట
స్కిల్‌ స్కామ్‌పై ప్రారంభమైన చర్చ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :శాసనసభలో రెండో రోజు శుక్రవారం కూడా సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం సభలో వీడియోలు తీయడంతో టిడిపి సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళపు అశోక్‌లను ఈ సెషన్‌ అయ్యే వరకు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. విజిల్స్‌ ఊదడంతో నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణలను ఒక రోజు సస్పెండ్‌ చేశారు. సస్పెండయిన సభ్యులను బయటకు పంపే క్రమంలో మార్షల్స్‌కు , టిడిపి సభ్యులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం మిగిలిన టిడిపి సభ్యులు కూడా సభ నుంచి నిష్క్రమించారు. టిడిపి సభ్యులు సభ నుండి వెళ్లిన తరువాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న అవినీతిపై అధికారపక్ష సభ్యులు చర్చను ప్రారంభించారు. అంతకు మందు సభ ప్రారంభమైన వెంటనే టిడిపి సభ్యులు చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, సైకో పాలన పోవాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టారు. పోడియంపైకి వెళ్ళి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని, టిడిపి సభ్యులు వయస్సుకు తగ్గ ప్రవర్తన కాకుండా అల్లరి చేస్తున్నారని, నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వారికేమి కావాలో స్పష్టంగా చెప్పకుండా సభకు అంతరాయం కలిగించడం మంచిది కాదన్నారు. ఇది అసెంబ్లీ అని, టిడిపి ఆఫీసు కాదన్నారు. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌పై చర్చిద్దామని, చర్చలో మాట్లాడాలంటే అది వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోమన్నారు. మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ సైకో జైలులో ఉన్నాడని, ఖైదీ నెంబరు 7691 అంటూ మాట్లాడారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటం, టిడిపి, వైసిపి సభ్యుల మధ్య ఉద్రిక్తత పెరుగుతుండటంతో స్పీకర్‌ తమ్మినేని సభ ప్రారంభమైన 15 నిమిషాలకే సభ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సైకో జగన్‌ డౌన్‌ డౌన్‌, సైకో పాలన పోవాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదే సందర్భంలో టిడిపి సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళపు అశోక్‌లు సభను వీడియో తీశారు. వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు కోరారు. వీడియోలు తీసిన ఇద్దరు సభ్యులను ఈ సెషన్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఈ సమయంలోనే టిడిపి సభ్యులు విజిల్స్‌ ఊదారు. బాలకృష్ణ కూడా విజిల్స్‌ ఊదుతూ కనిపించారు. దీంతో సభలో కొద్ది సేపు ఏమి జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. గందరగోళం మధ్యలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పును ఇతరులపైకి నెట్టివేసి చంద్రబాబును బేషరతుగా కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అవినీతిపై మాట్లాడదామని సవాల్‌ విసిరారు. దీంతో సభలో మరో సారి ఉ ద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సందర్భంలో టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు. అనంతరం సభను మరో సారి వాయిదా వేశారు. టిడిపి సభ్యులు బయటకు వెళ్లే క్రమంలో సైకో పోవాలని, సైకో పోవాలి- సైకిల్‌ రావాలి, సేవ్‌ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు.