Sep 27,2023 22:07
  • మండలిలో పిడిఎఫ్‌ తీవ్ర నిరసన
  • ఒపిఎస్‌తో దివాళా తీస్తాం : బిల్లు ప్రవేశపెడుతూ బుగ్గన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :ఉద్యోగ. ఉపాధ్యాయలు వ్యతిరేకతను ఏ మాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌ బిల్లును ఆమోదించింది.శాసనసభ సమావేశాల చివరిరోజైన బుధవారం బిల్లును ఉభయసభల్లోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ప్రతిపక్షమే లేకపోవడంతో చర్చ, ఓటింగ్‌ ఏకపక్షంగా సాగింది. మూజువాణి ఓటుతో శాసనసభ జిపిఎస్‌ బిల్లును ఆమోదించింది. మండలిలో పిడిఎఫ్‌ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. వీరి నిరసనల మధ్యే బిలులను ఆమోదిస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. అంతకుముందు శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ సిస్టిమ్‌ బిల్‌ా2023 (జిపిఎస్‌)ను రాష్ట్ర ఆర్థకశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిపిఎస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు కోరుతున్న ఒపిఎస్‌ను అమలుచేయడం సాధ్యం కాదని అన్నారు.
మొండిగా అమలు చేయాలని నిర్ణయించినా భవిష్యత్తులో దివాళా తీయడం ఖాయమన్నారు. 10 ఏళ్ల తర్వాత ఉద్యోగులకు జీతభత్యాలిచ్చే పరిస్థితి ఉండదన్నారు. రాజకీయం, ఎలక్షన్ల గురించి మాత్రమే ఆలోచిస్తే మమ అనిపించడం సాధ్యమే కానీ, భావి తరాల గురించి ఆలోచిస్తే సాధ్యంకాదన్నారు. రాష్ట్ర ఆర్ధికస్థితిగతులను దృష్టిలో ఉంచుకుని హైబ్రీడ్‌ మోడల్‌ యైన జిపిఎస్‌ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పదవీ విరమణ చేసిన ఎపి జిపిఎస్‌ చందాదారు పొందిన వార్షిక మొత్తంలో తగ్గుదల ఉంటే చివరిగా డ్రా చేసిన మూల వేతనంలో 50శాతం చొప్పున నెలవారీ ఫించను ఇస్తారని చెప్పారు. వార్షిక మొత్తంలో ఏదైనా తగ్గుదల ఉన్న నేపధ్యంలో రూ.10వేల టాప్‌ అప్‌ మొత్తాన్ని నెలవారీ కనీస హామీ పింఛన్‌ ఉండేటట్లు చూస్తామన్నారు.

  • జిపిఎస్‌ ప్రయోజనాల కోసం షరతులు:

జిపిఎస్‌ ఉద్యోగి హామీ పింఛన్‌ విధానం పొందేందుకు పలు షరతులను బిల్లులో పొందు పరిచారు. పదవీ విరమణ చేస్తున్నట్లయితే కనీసం 10 సంవత్సరాలు అర్హతగా సర్వీసు ఉండాలి. స్వచ్చంద పదవీ విరమణ చేసేటట్లయితే కనీసం 20 సంవత్సరాలు సర్వీసు తప్పని సరి. ప్రజాప్రయోజనం దృష్ట్యా పదవీ విరమణ చేస్తే కనీసం 33 సంవత్సరాలు సర్వీసు అర్హతగా నిర్ధేశించారు. వైద్య పరంగా సర్వీసు నుంచి పదవీ విరమణ చేసినచో కనీసం 10 సంవత్సరాలు సర్వీసు తప్పని సరి.

  • జిపిఎస్‌కు అనర్హులు వీరే:

ఎపిజిపిఎస్‌ చందాదారు రాజీనామా చేసిన కారణంగా సర్వీసు నుంచి విరమిస్తే జిపిఎస్‌కు అనర్హులని పేర్కొన్నారు. సర్వీసు నుంచి బర్తరఫ్‌ అయినవారు. సర్వీసు నుంచి తొలగింపునకు గురైనవారు, క్రమశిక్షణ చర్యల కారణంగా తప్పనిసరిగా ఉద్యోగ విరమణ చేయల్సివచ్చిన వారు జిపిఎస్‌కు అనర్హులు . అదే విధంగా ఉద్యోగ విరమణ చేసిన సమయంలో క్రమశిక్షణ, న్యాయపరమైన ప్రొసీడింగ్‌లు జరుగుతూ ఉంటే అవి పూర్తయిన తరువాతే పెన్షన్‌ చెల్లింపులు ఉంటాయని బిల్లులో పేర్కొన్నారు.

 

  • పిడిఎఫ్‌ ఆగ్రహం

- పోడియంపైకి ఎక్కి బిల్లు ప్రతులు చించివేత

- సభ నుంచి వాకౌట్‌

Image removed.

 రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌ బిల్లును ప్రవేశపెట్టడంపై శాసనమండలిలో పిడిఎఫ్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బిల్లును ప్రవేశపెట్టగానే పిడిఎఫ్‌ సభ్యులు తీవ్రంగా స్పందించాకరు. ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ షాబ్జి, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ నిరసన వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారని నాలుగు ఏళ్లుగా ఈ హామీని పట్టించుకోకుండా ఇప్పుడు జిపిఎస్‌ తెరపైకి తెచ్చి చట్టం చేయడం ఏమిటని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులను నమ్మించి నిలువునా మోసం చేశారని అన్నారు. ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ షాబ్జి, రఘువర్మ పోడియంపైకి ఒక్కసారిగా దూసుకువెళ్ళి బిల్లును ఆమోదించవద్దని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. బిల్లు ప్రతులను చింపి గాల్లోకి వేశారు. పోడియంపై నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'చీటింగ్‌..చీటింగ్‌' అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీల నిరసన మధ్యనే బిల్లు ఆమోదం పొందినట్టు చైర్మన్‌ ప్రకటించారు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తే ముగ్గురు ఎంఎల్‌సిలు సభ నుండి వాకౌట్‌ చేశారు.