- మంత్రిని నిలదీసిన వైసిపి ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసనసభలో మంగళవారం 'నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు, గ్రామ కంఠాలు' అనే అంశంపై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కందుకూరు వైసిపి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇదే అంశంపై మహీధర్‌రెడ్డి సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారంటూ మంత్రిని నిలదీశారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన పట్టా భూములను దేవాదాయశాఖ భూముల పరిధిలో 22(ఎ)(సి) నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో పేద రైతులు బదలాయించుకోలేక ఎనిమిదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నిషేధిత భూముల జాబితా నుంచి ఎన్ని సర్వే నెంబర్లు తొలగించారు? ఇంకెన్ని తొలగించాల్సి ఉందని మంత్రిని ప్రశ్నించారు. కందుకూరు నియోజకవర్గంలో సర్వే నెంబరు 297/1లో 650 ఎకరాలు భూమి ఉంటే.. అందులో దేవాదాయశాఖకు చెందిన భూమి కేవలం 15 ఎకరాలు మాత్రమేనన్నారు. సర్వే నెంబరు మొత్తాన్ని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని ఏడేళ్లుగా రైతులు తిరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఏడేళ్లుగా తొలగించేందుకు ఉన్న అభ్యంతరాలేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ సమాధానమిస్తూ.. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ప్రస్తావించిన సర్వే నెంబర్‌లోని భూమి సబ్ డివిజన్ జరగకపోవడంతో దేవాదాయశాఖ, రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని, పొరపాటున నమోదు చేశారని వివరణ ఇచ్చారు. పొరపాటుకు కారకులైన వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు.










