- చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదన్న మంత్రి రోజా
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ జై కొట్టింది. మహిళా సాధికారత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కేంద్ర ఫ్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థించిన మొదటి రాష్ట్రంగా ఎపి నిలిచింది. అనంతరం మహిళ సాధికారతపై జరిగిన చర్చలో మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వం కంటే వైసిపి ప్రభుత్వం పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టిందని, ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలను ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. మంత్రి ఆర్‌కె రోజా మాట్లాడుతూ ''భవిష్యత్తుకు గ్యారెంటీ - బాబు ష్యూరిటీ'' అని చెప్పిన చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఇంటికి పంపిస్తానని చెప్పిన చంద్రబాబు నేడు రాజమండ్రి జైలులో ఉన్నారని, జగన్‌కు భయాన్ని పరిచయం చేస్తానన్న లోకేశ్ భయపడి ఢిల్లీకి పారిపోయారని అన్నారు. మహిళల కోసం జగన్ చేసిన కృషికి జగనన్నా.. అంటూ ఒకటికి రెండు సార్లు పిలిచి సిఎంకు రోజా సెల్యూట్ చేశారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ మహిళా సంక్షేమంలో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళా రైతులకు సిఎం జగన్ అండగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే కె.శ్రీదేవి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. టిడిపి ప్రభుత్వం పొదుపు సంఘాలను మోసం చేసిందన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. మాజీమంత్రి పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డకు సిఎం జగన్ అండగా ఉన్నారని, రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.










