Jul 01,2023 10:36

న్యూఢిల్లీ : 27వ దఫా ఎన్నికల బాండ్ల జారీకి ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. వీటి అమ్మకాలు జులై 3 నుండి ప్రారంభం కానున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణా, మిజోరాంల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. కొద్ది నెలల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం వుంది. రాజకీయ పార్టీలకు నగదు విరాళాలు ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చినవే ఈ ఎన్నికల బాండ్లు. రాజకీయ పార్టీలకు అందే నిధుల విషయంలో పారదర్శకతను తీసుకురావడానికి జరుగుతున్న కృషిలో భాగంగా వీటిని తీసుకువచ్చారు. ఈ బాండ్ల జారీకి, నగదుగా మార్చుకోవడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతి ఇచ్చారు. జులై 3-12 తేదీల్లో దేశవ్యాప్తంగా గుర్తించిన 29 ఎస్‌బిఐ శాఖల ద్వారా బాండ్ల లావాదేవీలు జరపవచ్చని ఆర్థిక మంత్రత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 2018 మార్చి 1-10 తేదీల్లో మొట్టమొదటి దఫా ఎన్నికల బాండ్ల విక్రయాలు జరిగాయి. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్‌, కోల్‌కతా, గువహటి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీఘడ్‌, శ్రీనగర్‌, గాంధీనగర్‌, భోపాల్‌, రారుపూర్‌, ముంబయిల్లో అనుమతించిన ఎస్‌బిఐ బ్రాంచీలు వున్నాయి. బాండ్‌ జారీ అయిన తేదీ నుండి 15రోజులు చెల్లుబాటులో వుంటుంది. గడువు తీరిన తర్వాత బాండ్‌ను డిపాజిట్‌ చేసినట్లైతే ఏ రాజకీయ పార్టీకీ చెల్లింపులు జరగవని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. భారతీయ పౌరులు లేదా దేశంలోని సంస్థలు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేయగలవు. రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీలు, గత లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతానికి తక్కువ కాకుండా ఓట్లు సాధించిన పార్టీలు మాత్రమే ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు అందుకునేందుకు అర్హత గలవి.