Nov 05,2023 08:12

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 29వ విడత ఎన్నికల బాండ్ల విక్రయాలకు తెర లేచింది. ఈ నెల 6 నుంచి ఈ బాండ్ల అమ్మకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)కు చెందిన 29 శాఖల్లో (బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్‌, కలకత్తా, గౌహతి, చెన్నై, పాట్నా, ఢిల్లీ, చండీగఢ్‌, శ్రీనగర్‌, గాంధీనగర్‌, భోపాల్‌, రాయపూర్‌, ముంబయి తదితర నగరాల్లో) వీటిని విక్రయించనున్నారు. 2018 నుంచి ఇప్పటివరకూ 28 విడతల్లో ఎన్నికల బాండ్లను విక్రయించారు. ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం క్విడ్‌ ప్రోకోకు దారితీస్తోందని, అధికార పార్టీలకే భారీగా నిధులు వస్తున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదిక ఇప్పటికే బయటపెట్టింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్‌ చేస్తూ సిపిఐ(ఎం), ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇంకా వెల్లడించాల్సి ఉంది.
గత లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ఒకశాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైన పార్టీలకు నిధులు సమకూర్చాలని భావించే వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. గడువు తేదీ ముగిసిన తర్వాత బాండ్లను జమ చేసినా నగదు జమ కాదు. ఎలక్టొరల్‌ బాండ్లను సిపిఐ(ఎం) మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడమే ఈ ఎలక్టొరల్‌ బాండ్ల విధానం ఉద్దేశమని, అందుకే దీనిని రద్దు చేయాలని మార్క్సిస్టు పార్టీ, ఇతర ప్రజాతంత్ర శక్తులు డిమాండ్‌ చేస్తున్నాయి.