న్యూఢిల్లీ : పొదుపు చర్యల్లో భాగంగా స్విగ్గీ తమ క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని విక్రయించింది. తన క్లౌడ్ కిచెన్ వ్యాపారం స్విగ్గీ యాక్సెస్‌ను కిచెన్స్‌ఏ కు అమ్మేసినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇప్పటికే వ్యయాలను తగ్గించుకునే పనిలో భాగంగా 380 మంది ఉద్యోగులను తొలగించింది. తమ అంచనాలకు అనుగుణంగా వ్యాపార వృద్థి చోటు చేసుకోవడం లేదని.. ఈ క్రమంలోనే లాభదాయకతపై ప్రభావం చూపుతోన్న పరోక్ష వ్యయాలను సమీక్షించుకోవాల్సి వస్తోందని స్విగ్గీ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష పేర్కొన్నారు. రెస్టారెంట్లు లేని ప్రాంతాల్లో.. ఫుడ్ డెలివరీకి డిమాండ్ ఉన్న చోట్ల ప్రత్యేకంగా డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 2017లో స్విగ్గీ యాక్సిస్‌ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.175 కోట్లు వ్యయం చేయనున్నట్లు అప్పట్లో ఆసంస్థ తెలిపింది. కిచెన్ క్లౌడ్‌ను ఎంత మొత్తానికి విక్రయించిందనేది స్విగ్గీ వెల్లడించలేదు. అయితే కిచెన్స్‌ఏ లో మాత్రం వాటాదారుగా ఉండనుందని పేర్కొంది.










