Mar 02,2023 21:28

న్యూఢిల్లీ : యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) వాటాలను విక్రయించనుందని తెలుస్తోంది. యస్‌ బ్యాంక్‌ సంక్షోభ సమయంలో మూడేళ్ల క్రితం ఆర్‌బిఐ సూచనల మేరకు ఎస్‌బిఐ సహా ఇతర విత్త సంస్థలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మార్చి 6 నాటితో ఎస్‌బిఐకి ఆర్‌బిఐ పెట్టిన మూడేళ్ల లాక్‌ఇన్‌ పీరియడ్‌ ముగియనుంది. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి కూడా కొంత పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బిఐ తనకున్న షేర్లను విక్రయించనుందని రిపోర్టులు వస్తున్నాయి. 2022 డిసెంబర్‌ 31 నాటికి ఎస్‌బిఐకి 26.14 శాతం వాటా ఉంది. మూడేళ్లు పూర్తయ్యే వరకు తమ వాటాను 26 శాతం కంటే దిగువకు తగ్గించుకోవడానికి వీలు లేదని ఆర్‌బిఐ అప్పట్లో నిబంధన పెట్టింది. సోమవారం నాటికి లాకిన్‌ గడువు ముగియనుంది. యస్‌ బ్యాంక్‌లో వాటాల ఉపసంహరణపై త్వరలో ఎస్‌బిఐ బోర్డు భేటీ కానుందని.. ఇందులో ఎంత వాటాలు తగ్గించుకునే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 2020 మార్చిలో యస్‌ బ్యాంక్‌ తీవ్ర అప్పుల సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సమయంలో ఆ బ్యాంక్‌ను పునరుద్దరించేందుకు ఆర్‌బిఐ కల్పించుకుని ఎస్‌బిఐతో మెజార్టీగా 49 శాతం వాటాలను, ఎల్‌ఐసి సహా ఇతర బ్యాంక్‌లతో వాటాలను కొనుగోలు చేయించింది. ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్‌కు 2.61 శాతం,యాక్సిస్‌ బ్యాంక్‌కు 1.57 శాతం, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ 1 శాతం, ఎల్‌ఐసి 4.34 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు 3.48 శాతం చొప్పున వాటాలున్నాయి. గురువారం బిఎస్‌ఇలో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 4.43 శాతం తగ్గి రూ.17.49 వద్ద ముగిసింది. మూడేళ్ల క్రితం ఈ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసే సమయంలో ఆ షేర్‌ ధర రూ.10గా ఉంది.