Jan 23,2023 07:44

          రంగస్థలం, సాహిత్యం ఈ రెంటి మేలు కలయికగా అజో విభో కందాళం ఫౌండేషన్‌ వారి వార్షిక ఉత్సవాలు ఈనెల 5 - 8 తేదీల మధ్య నంద్యాలలో జరిగాయి.. రంగస్థలం కథా నాటికల పోటీ ప్రదర్శనలు 5, 6, 7 తేదీల్లో సాయంత్రాల్లో; సాహిత్య సాంస్క ృతిక కార్యక్రమాలు 6, 7, 8 తేదీల్లో ఉదయం, సాయంత్ర వేళల్లో జరిగాయి. ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు జీవితకాల సాహితీ మూర్తి సాధనా పురస్కారం పల్లేటి లక్ష్మీ కులశేఖర్‌కు 5న, విశిష్ట బాల సాహిత్య రచనాపురస్కారం ఎం.హరి కిషన్‌కు 6న అందజేశారు. వారి కృషి, రచనలకు సంబంధించిన విశేష సంచికలను కూడా ఫౌండేషన్‌ వారు ప్రచురించారు. 8వ తేదీ ఉదయం డాక్టర్‌ కోడూరు ప్రభాకర్‌ రెడ్డికి 2023 ప్రతిభ మూర్తి జీవితకాల సాధనా పురస్కారాన్ని అందించి, ప్రతిభా వైజయంతి సమ్మానోత్సవ విశేష సంచికని ప్రచురించారు, ఎప్పటిలాగే !
             ఉభయ రాష్ట్రాల్లోని సమాజాల దరఖాస్తు చేసుకున్న 28 నుంచి 19 నాటికలను ప్రాథమిక పరిశీలన చేసిన అనంతరం ఏడు నాటికలను నంద్యాల టౌన్‌ హాల్లో ప్రదర్శించారు. మొదటి రోజు ఐదో తేదీ మినిస్టరొతాండు, తెల్ల కలువ - నల్ల కోయిల, స్వర్ణకమలాలు; 6న కొత్త పరిమళం, అగ్ని సంస్కారం; 7న థాంక్స్‌ ఫర్‌ ద పీఎం, ప్రేమతో నాన్న నాటికలను ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలుగా కొత్త పరిమళం (శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కతిక సేవా సమాజం, బొరివంక); ప్రేమతో నాన్న (శ్రీ సాయి ఆర్ట్స్‌ కొలకలూరు) నిలిచాయి.
          అజో విభో కందాళం -2023 సాహితీ, ప్రతిభా వైజయంతి పురస్కారాలు పొందిన ముగ్గురూ మూడు రంగాల్లో విశిష్ట సాహితీమూర్తులు. పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు, ఆకాశవాణి శ్రవ్య నాటికలు, నాటకాలు రాసిన పల్లేటి లక్ష్మీ కులశేఖర్‌ లబ్ద ప్రతిష్టుడైన తెలుగు నాటక రచయిత. వీరిపై సమ్మానోత్సవ విశేష సంచికకు డాక్టర్‌ మూల మల్లికార్జున రెడ్డి సంపాదకత్వం వహించారు. (37 మంది వ్యాస కర్తల రచనలతో). ఎం.హరికిషన్‌ సమ్మానోత్సవ విశేష సంచికకు కథా రచయిత జి.ఉమామహేశ్వర్‌ సంపాదకత్వం వహించారు (32 మంది వ్యాస కర్తలు). డాక్టర్‌ కోడూరు ప్రభాకర్‌ రెడ్డి ప్రతిభా వైజయంతి సమ్మానోత్సవ విశేష సంచికకు కథా రచయిత వడలి రాధాకష్ణ సంపాదకత్వం వహించారు (22 మంది వ్యాస రచయితలు). ఇందులోని ప్రఖ్యాతులైన రచయితలు ఆ వ్యక్తుల గురించిన తమ అభిప్రాయాలను భిన్న కోణాల్లో రాసి దర్శింపచేశారు. పురస్కార గ్రహీతల జీవిత సంగ్రహాల్ని పరిశీలిస్తే అవి వ్యక్తిత్వ వికాస పాఠ్యాంశాల్లా మనల్ని ప్రేరేపిస్తాయి, ఉత్సాహపరిస్తాయి, గర్వపడేలా చేస్తాయి.
              'కథానాటికలు 2023' పేరుతో ఈ సంవత్సరం కూడా తుది పోటీలకు ఎంపిక చేసిన ఏడు కథానాటికల్ని ఒక సంకలనంగా విడుదల చేశారు. ఈ సంచికలో మూల కథతో పాటు నాటకీకరణ లేదా నాటకానువాదం కలిపి ఉంటాయి. బహుమతి పొందిన రెండు నాటికల్లో 'కొత్త పరిమళం' ... మనుషుల మనసుల్లో, దేశాల మధ్య నిర్మించుకున్న సరిహద్దులు తొలగించి, మానవత్వం వర్ధిల్లాలి అన్న సందేశంతో సాగింది. మూల కథా రచయిత కాండ్రేగుల శ్రీనివాసరావు కాగా, నాటకీకరణ : కేకేఎల్‌ స్వామి దర్శకత్వం : బిఎంఎస్‌ పట్నాయక్‌. 'ప్రేమతో నాన్న' మూల కథ రచయిత విజయార్కే. నాటకీకరణ : రావి నాగేశ్వరరావు. దర్శకత్వం : గోపరాజు విజరు. ప్రతి తండ్రికి కూతురు పట్ల ప్రేమ ఒక్కటే ఉంటే చాలదు, వాళ్లు కష్టాల్లో ఉంటే బాధపడడం కాకుండా వాటిని ఎదిరించే మనోధైర్యం వాళ్ళల్లో కలిగించడానికి, తగిన ఆత్మ ధైర్యం కలిగి ఉండాలని ఈ నాటిక చెబుతుంది. అమ్మాయిలూ, ధైర్యంగా నిలబడండి. అన్యాయానికి ఎదురు తిరగండి. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ముందుకు సాగండి.. అన్నదే ఈ నాటిక సందేశం. ఫౌండేషన్‌ నిర్వాహకులు, బుద్ధుని విధేయులు అప్పాజోశ్యుల సత్యనారాయణ, కందాళం రామానుజాచారి, నంద్యాల కళారాధన సంస్థ తరఫున డాక్టర్‌ జి రవికృష్ణ, డాక్టర్‌ మధుసూదన్‌ రావు నిర్వహణ బాధ్యతలను క్రమశిక్షణతో సమయపాలనతో నిర్వహించడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655