- జానీ తక్కశిలాకు యువ, డికె చదువుల బాబుకు సాహిత్య అకాడమీ బాల పురస్కారం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర సాహిత్య అకాడమీ 2023కు గానూ యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2023 తెలుగులో జానీ తక్కశిలా (జానీ బాష చరణ్ తక్కశిలా)కు వచ్చింది. ఆయన రాసిన వివేచని విమర్శనాత్మక నవలకు పురస్కారం వరించింది. శుక్రవారం నాడిక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌసిక్ అధ్యక్షతన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరిగింది. జ్యూరీ సభ్యులు ప్రతిపాదనల మేరకు మొత్తం 20 భాషలకు సంబంధించిన 20 మంది రచయితలను యువ పురస్కారానికి, 22 మంది బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు. మణిపూరి, మైథాలీ, సంస్కృతంలో యువ పురస్కారాలను తరువాత ప్రకటిస్తారు. సమావేశ అనంతరం అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, రాగి మెమోంటో అందజేస్తారు. యువ పురస్కారానికి తెలుగు భాషకు జ్యూరీ సభ్యులుగా ఆవుల మంజులత, డి శ్రీనివాసచార్యా, వెడ్డేపల్లి కృష్ణ వ్యవహరించారు. తెలుగుకు సంబంధించి మొత్తం తొమ్మిది నవలలు రాగా, అందులో వివేచనీ విమర్శనాత్మక నవలను జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.డికె చదువుల బాబుకు సాహిత్య అకాడమీ బాల పురస్కారం-2023 వరించింది. ఆయన రాసిన వజ్రాల వాన (షార్ట్ స్టోరీ) చిన్న కథకు ఈ పురస్కారం లభించింది. అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, రాగి మెమోంటో అందజేస్తారు. బాల పురస్కారానికి తెలుగు భాషకు సంబంధించి దాసరి వెంకటరమణ, కండెపి రాణిప్రసాద్, నరంశెట్టి ఉమామహేశ్వరరావు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. తెలుగు భాషలో మొత్తం ఎనిమిది పుస్తకాలు రాగా అందులో డికె చదువుల బాబు రాసిన వజ్రాల వానను జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.