Jun 06,2023 09:17

ఒరిస్సా బాలాసోర్‌ రైలు ప్రమాదం మృత్యుఘంటిక మోగించిన వేళ.. మానవత్వ హృదయాలెన్నో ఆపన్నహస్తాలు అందించాయి. భీతావహ వాతావరణంలోనే ఒక కంట తడిపెడుతూ.. మరో కంట బాధితులను రక్షించాలని పరితపించాయి. వందలాది మంది ప్రాణాలను రక్షించడంలో.. సకాలంలో ఆస్పత్రులకు చేరవేయడంలో వారు చేసిన కృషి అభినందనీయం. మానవత్వం పరిమళించిన మంచి జాడలు ఇవిగో ...

జూన్‌ 2. శుక్రవారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలు, ఫూలామణి హెంబ్రం వంటగదిలో పనిచేసుకుంటోంది. అప్పుడు ఉన్నట్లుండి తన ఇంటి పక్కనే ఉన్న రైలు పట్టాల మీద నుండి భీకర శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఆమె ఉన్న చోటుకు సరిగ్గా 200 మీటర్ల దూరం నుంచి వచ్చింది. జరిగిన ప్రమాదాన్ని ఊహించిన ఫూలామణి చేస్తున్న పనిని పక్కనపెట్టేసి అటువైపు పరుగు తీసింది. భర్త రఘు ఆమెను అనుసరించాడు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. చీకటి ఆవరించింది. అయినా ఆ భార్యాభర్త వెనుకడుగు వేయలేదు.
         'నా జీవితంలో మొదటిసారి నేను అన్ని మృతదేహాలు చూశాను. చాలా భయమేసింది. రక్తపు మడుగులో ఎంతోమంది విగతజీవులుగా మారిపోయారు. గుండె దిటవు చేసుకుని వారందరినీ దాటుకుని ముందుకు ఉరికాను. నేను అక్కడికి చేరేసరికి ఓ చిన్న పాప రైలు కిటికీలకు వ్రేలాడుతూ కనిపించింది. కాళ్లూచేతులకు గాయాలై రక్తం కారుతోంది. ఆ పాప అమ్మ కూడా అక్కడే గాయాలతో పడి ఉంది. లేవలేని స్థితిలో బిడ్డను రక్షించుకోలేక ఆ తల్లి గట్టిగా అరుస్తూ ఉంది. మేము అక్కడికి వెళ్లి ఆ పాపను, తల్లిని మా ఇంటికి తీసుకువచ్చాం. మంచినీళ్లు తాగించి డాక్టరును పిలిచాం. తల్లీబిడ్డను అక్కడే వదిలేసి మళ్లీ రైల్వే ట్రాకు వైపు వెళ్లాను' అంటూ ఆనాటి భయంకర దృశ్యాన్ని వర్ణిస్తున్న ఫూలామణి 30 ఏళ్ల గిరిజన మహిళ. ఆ రోజు అలా అరడజను మందికి పైగా చిన్నారులను ఆమె రక్షించింది.
         హెంబ్రం దంపతులిద్దరూ ఈసారి ట్రాకుపై క్షతగ్రాతులుగా పడి ఉన్న 30 మందిని హాస్పటల్‌కు చేరేందుకు వాహనాలు సమకూర్చారు. అలా బాలాసోర్‌ రైలు ప్రమాద వార్త అందిన క్షణాల వ్యవధిలో రెస్య్కూ బృందాలు ప్రమాదస్థలిని సమీపించేలోపు కృష్ణపూర్‌, కమరిపూర్‌ గ్రామాల నుంచి 58 మంది గిరిజనులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 200 మంది బాధితులను రక్షించారు. బోగీల మధ్య చిక్కుకుపోయిన మృతదేహాలను కిందకు దించారు.
         'నేను బోగీల దగ్గరకు చేరేసరికి ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో హోరెత్తిపోతోంది. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పడివున్నాయి. ఇంకా బోగీల్లో చిక్కుకుని వ్రేలాడుతూ చాలామంది ఉన్నారు. కాళ్లూ చేతులు తెగిపడి మొండెం మాత్రమే ఉన్న ఎన్నో మృతదేహాలను బోగీలపైకెక్కి మరీ కిందికి దించాను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ల నుండి చెదరలేదు. ఇంత ప్రమాదాన్ని చూసిన మేమంతా ఎంత భయపడ్డామో.. మాటల్లో చెప్పలేం. ఆ బోగీల్లో ఏదైనా మా ప్రాంతంపై పడి వుంటే మేమంతా ఇప్పుడు ఇలా ఉండేవాళ్లం కాదు..' అంటూ తన అనుభవాన్ని చెబుతున్నాడు మరో గిరిజన యువకుడు మహేశ్వర కిస్కు.
           పూర్ణచంద్ర ఓ రైతు. ఆ రోజు సాయంత్రం మార్కెట్లో పనులు ముగించుకుని తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళుతున్నాడు. రైల్వే ట్రాక్‌ సమీపంలోకి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది. 'పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు బోగీలు పక్కకు ఒరిగిపోవడం మా కళ్ల ముందే కనిపించింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయినా వెంటనే తేరుకుని అటువైపు పరుగెత్తాం. మేము అక్కడకు వెళ్లే సరికి దట్టమైన పొగ కమ్మేసింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. రక్తం మడుగులో శవాలు తేలుతున్నాయి. కాళ్లు, చేతులు విరిగిపడి బాధతో విలవిల్లాడుతున్నవారు ఎంతోమంది కనిపించారు. వారిని రక్షించే క్రమంలో నా బట్టలు కూడా రక్తంతో తడిశాయి' అంటూ చెబుతున్న మాలిక్‌ సరైన సమయంలో అక్కడకు చేరుకుని బోగీల నుంచి 30 మంది ప్రయాణికులను రక్షించారు.
         'ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న నేను ఓ నిచ్చెన సాయంతో బోగీలపైకి చేరుకుని ప్రయాణికులను రక్షించాను. క్షణం ఆలస్యం చేసినా ప్రమాద తీవ్రత ఇంకా తీవ్రంగా ఉండేది' అంటూ తన అనుభవాన్ని పంచుకున్న దినసరి కూలీ సుదర్శన్‌ దాస్‌ రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతాన్ని చేరుకునేసరికి పదులు సంఖ్యలో ప్రయాణికులను రక్షించాడు.
            'ప్రమాదం జరిగిన మొదటి అరగంట లోపు ఎంతమందిని వీలైతే అంతమందిని రక్షించాలని అక్కడికి చేరుకున్నాను. అయితే బోగీల నుంచి అలా తీసుకొచ్చే క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలా నా చేతుల్లో ఓ పెద్దాయన, ఓ బిడ్డ చనిపోయారు. ఆ క్షణం నేను మొద్దుబారిపోయాను. వాళ్లు మంచినీళ్లు అడిగారు. వాళ్లను ఎలాగైనా రక్షించాలన్న తాపత్రయంలో వాళ్లకు నీళ్లు కూడా పట్టించలేకపోయాను. అది తలచుకుంటే ఇప్పటికీ బాధేస్తుంది' అంటూ కంటతడి పెట్టుకున్నాడు రంజన్‌ ముర్ము.
            రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించే గణేష్‌ ప్రసాద్‌ నాయక్‌ కళ్లెదుటే ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం ప్రార్థన ముగించుకుని ఇంటకి వెళుతున్న అతడు ఈ ప్రమాద దృశ్యాన్ని చూశాడు. ప్రయాణికులను రక్షించేందుకు అటువైపుగా పరుగుతీశాడు. 'నా మిత్రులకు ఫోను చేసి వెంటనే రమ్మని చెప్పాను. మేమంతా కలిసి 71 మృతదేహాలను వెలికితీశాం. ఒక్క మహిళనే రక్షించగలిగాం. బయటికి తీసుకువచ్చిన దగ్గర నుంచి ఆమె తన 18 ఏళ్ల కొడుకు గురించి ఆరా తీస్తూనే ఉంది. ఆ తల్లి బాధ చూడలేక సెల్‌ఫోను లైటు వేసుకుని నేను మళ్లీ ఆ బోగీ దగ్గరకు చేరుకున్నాను. అక్కడ ఆమె కొడుకు విగతజీవిగా పడిఉన్నాడు. ఆ సంగతి ఆమెకు చెప్పలేక అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించాను. అటువైపుగా వస్తున్న ఓ వ్యక్తిని ఆమె తన కొడుకును వెతికిపెట్టమని దీనంగా వేడుకోవడం నాకు కనపడుతూనే ఉంది. ఆ క్షణం నాకు దు:ఖం కట్టలు తెంచుకుంది' అంటూ ఇప్పుడు చెబుతున్నా ఆ ఇన్‌స్పెక్టర్‌ కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి.
          ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రమాదంలో బయటపడిన వారిని రక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద అనుభవం. రక్తదానం చేసేందుకు అక్కడికి గుంపులుగా చేరుకుంటున్న వారంతా స్వచ్చందంగా ముందుకువచ్చినవారే.
'బాధితులెవరో మాకు తెలియదు. కాని వారు ఆపదలో ఉన్నారు. వాళ్లను రక్షించడంలో మా వంతుగా ఏదైనా చేయాలనుకున్నాం. అందుకే బాలాసోర్‌ జిల్లా ఆస్పత్రిలో రక్తదానం చేసేందుకు 25 మంది బృందంగా చేరుకున్నాం' అంటున్నాడు భద్రక్‌ ప్రాంత వాసి. అలా ఆ ఆస్పత్రిలో స్థానికులు ఇచ్చిన రక్తదానంతో 500 యూనిట్ల రక్తం బాధితులకు అందించారు. 900 యూనిట్ల రక్తం స్టాక్‌లో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వీరంతా బాధితులను ఎప్పుడూ కలుసుకోలేదు.. భవిష్యత్తులో కలుస్తారనీ లేదు.. కానీ ఆపదలో ఆదరించాలన్న లక్ష్యమే వారందరినీ ఇంత పెద్ద విపత్తులో ముందుకు నడిపించింది. మానవత్వం ముందు కులం, మతం ఎప్పుడూ దిగదుడుపే..! ఆపదల వేళ మనుషులు సహజంగా మానవత్వంతోనే స్పందిస్తారు. అది ఎల్లప్పుడూ సాగాల్సిన మానవీయ గుణం.