ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ (బాపట్ల) : జిల్లాలోని ఇంకొల్లు, వేటపాలెం, చీరాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించి అధికారులకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా పరిధిలోని 13 మండలాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించామన్నారు. ఏదైనా అనుకోని సమస్య తలెత్తిన వెంటనే స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంకొల్లు, వేటపాలెం, చీరాలలోని పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల జాబితాలో ఉండడం వలన ఈ రోజు స్వయంగా సదరు పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. జిల్లాలోని 13 మండలాలలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్‌పి పి.శ్రీకాంత్, రేపల్లె డి.ఎస్.పి టి.మురళీకృష్ణ , డి.ఎస్.బి ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాస్ , ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ వి.మల్లికార్జునరావు, చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.మల్లికార్జునరావు, సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










