Jul 10,2023 11:56

పార్వతీపురం (మన్యం) : విద్యార్థి దశలోనే అవకాశాలు కాలరాస్తున్న ప్రభుత్వం మేలుకోవాలని, పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... సాంఘిక సంక్షేమ పోస్టుమెట్రిక్‌ హాస్టల్లకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. డిగ్రీలో మేజర్‌, మైనర్‌ సిలబస్‌ను రద్దు చేయాలని కోరారు. పార్వతీపురం గిరిజన పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్స్‌కు అదనపు భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. గరుగుబిల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో మహిళా జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. మెనూ సక్రమంగా అమలుపరచాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్‌ ఛార్జీలను పెంచాలని కోరారు. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.