క్యూ2లో రూ.14,330 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మార్కెట్ నిపుణుల అంచనాలు మించి ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఎస్‌బిఐ నికర లాభాలు 8 శాతం వృద్థితో రూ.14,330 కోట్లుగా నమోదయ్యాయి. రూ.14,220 కోట్ల మేర లాభాలు ఆర్జించే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు తొలుత అంచనా వేశారు. కాగా.. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,265 కోట్ల లాభాలు సాధించింది. క్రితం క్యూ2లో ఎస్‌బిఐ నికర వడ్డీపై ఆదాయం (ఎన్‌ఐఐ) 12.3 శాతం పెరిగి రూ.39,500 కోట్లుగా చోటు చేసుకుంది. రుణాల జారీలో 12.39 శాతం వృద్థి నమోదయ్యింది. విదేశీ కార్యాలయాల రుణాలు రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను చేరాయి. మొత్తం బ్యాంక్ డిపాజిట్లలో 11.91 శాతం వృద్థి చోటు చేసుకుందని ఆ బ్యాంక్ తెలిపింది.
గడిచిన సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.55 శాతానికి తగ్గాయి. 2022 ఇదే సెప్టెంబర్ నాటికి 3.52 జిఎన్‌పిఎలు ఉన్నాయి. క్రితం క్యూ2 ముగింపు నాటికి ఎస్‌బిఐ నికర ఎన్‌పిఎలు ఏకంగా 0.64 శాతానికి పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 0.80 శాతంగా ఉన్నాయి. 2023 సెప్టెంబర్ నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 11.91 శాతం పెరిగి రూ.46.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు వేతన జీవుల ఖాతాలు కలిగిన వారికి రూ.3.03 లక్షల కోట్ల రుణాలను జారీ చేశామని ఎస్‌బిఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖార అన్నారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 శాఖలను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది.