
ప్రజాశక్తి - గన్నవరం (ఎన్‌టిఆర్ జిల్లా) :ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్‌లో విలువిద్యలో బంగారు పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, చెస్‌లో వెండి పతకాలు సాధించిన కోనేరు హంపి బుధవారం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి డప్పు వాయిద్యాలతో క్రీడా సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఆర్చరీ (విలువిద్య) పోటీల్లో మొట్టమొదటిసారిగా ఒకేసారి వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించడం చాలా సంతోషంగా ఉందని జ్యోతి సురేఖ తెలిపారు. చెస్ మహిళల కేటగిరీలో వెండి పతకం సాధించడం ఇదే మొదటిసారని కోనేరు హంపి పేర్కొన్నారు.