- గుర్రపుడెక్క తొలగింపునకు కాలువలో దిగి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన వైనం
- నిర్వహణకు రెండేళ్లుగా నిధులు ఇవ్వని ఫలితం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : వంశధార కాలువల నిర్వహణలో ప్రభుత్వ ఉదాసీనం ఓ రైతు గల్లంతుకు దారితీసింది. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడిక తొలగించేందుకు నిధులు కావాలని అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ నెల 29న పోలాకికి చెందిన పదిమంది రైతులు స్వయంగా కాలువల్లోకి దిగి గుర్రపుడెక్క తొలగించుకునే పని మొదలుపెట్టారు. కాలువల్లో నీటి ఉధృతికి ముప్పిడి శాంతారావు (62) అనే రైతు గల్లంతయ్యారు. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు, రెవెన్యూ శాఖ ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గుర్రపుడెక్క కోసం దిగి గల్లంతయ్యారంటే ప్రభుత్వానికి అప్రతిష్ట అని భావించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతైనట్లుగా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు వంశధార కాలువల్లోని నీరు కాలువను ఆనుకుని ఉన్న పొలాలను ముంచెత్తింది. గుర్రపుడెక్క తొలగిస్తే నీరు కిందికి పోయి తమ పంటను కాపాడుకోవచ్చని భావించిన రైతులు కాలువలోకి దిగారు. ఈ క్రమంలోనే నీటి ఉధృతికి రైతు కొట్టుకుపోయారు.
సకాలంలో నిధులు విడుదల చేసి ఉంటే...
వంశధార కుడి, ఎడమ కాలువల్లో పెద్ద ఎత్తున గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోయింది. వీటి తొలగింపునకు నిధులు కావాలంటూ వంశధార ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి రెండేళ్ల కిందటే రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు ఆ ఫైల్‌కు మోక్షం లభించలేదు. శివారు భూములకు నీరందడం లేదని రైతుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో గతేడాది కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ రూ.40 లక్షలు కేటాయించారు. వాటితో పాక్షికంగా తొలగించారు. ఈ సంవత్సరానికి సంబంధించి వారం రోజుల కిందట మరో రూ.50 లక్షలు విడుదల చేశారు. వేసవి సీజన్‌లోనే తొలగింపు పనులు చేపట్టాల్సి ఉన్నా, ఆలస్యంగా నిధులు ఇవ్వడంతో ఇప్పటివరకు పనులు జరగలేదు.
రెండేళ్ల కిందటే ప్రతిపాదనలు పంపాం
వంశధార కుడి, ఎడమ కాలువల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వానికి రెండేళ్ల కిందటే ప్రతిపాదనలు పంపాం. జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులతో గతేడాది తాత్కాలికంగా పనులు చేపట్టాం. ఈ సంవత్సరం ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది.
- డోల తిరుమలరావు, వంశధార సర్కిల్ ఎస్‌ఇ