డాలర్‌తో పోల్చితే 83.33కు క్షీణత
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో భారత రూపాయి విలువ ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో పడిపోయింది. బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు పతనమై ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 83.33 కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటుగా, పెరిగిన ముడి చమురు ధరల వల్ల రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురైయ్యింది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకం వద్ద డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 83.26 వద్ద ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 83.35 కనిష్ట స్థాయిని తాకింది. ఓ దశలో 83.26 గరిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అయ్యింది. తుదకు 9 పైసలు కోల్పోయి 83.33 వద్ద ముగిసింది. మంగళవారం ఎషన్‌లో 83.24 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు డాలర్‌కు డిమాండ్‌ను పెంచాయని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారెల్ ముడి చమురుపై ధర 1.34 శాతం పెరిగి 86.16 డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొవడం రూపాయిపై ప్రభావం చూపింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 283.60 పాయింట్లు లేదా 0.44 శాతం పతనమై 63,591కి తగ్గింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయి 18,989 వద్ద ముగిసింది. రూపాయి విలువ పడిపోవడం ద్వారా దిగుమతి ఉత్పత్తులు భారం కానున్నాయి. విదేశీ చెల్లింపుల కోసం అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.