Sep 27,2023 21:14
  • చిన్న నగరాల నుంచి ఆదరణ

న్యూఢిల్లీ : దేశంలో రూపే క్రెడిట్‌ కార్డ్‌లకు భారీగా డిమాండ్‌ పెరుగుతోందని ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ జడ్‌ఇటి ఓ రిపోర్ట్‌లో తెలిపింది. యుపిఐ చెల్లింపులకు రూపే క్రెడిట్‌ కార్డులు అనుసంధానం చేసేందుకు ఆర్‌బిఐ అనుమతించడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. భారత్‌లోని 706 చిన్న పట్టణాలు, నగరాల నుంచి రూపే క్రెడిట్‌ కార్డులకు వస్తున్న డిమాండ్‌ ఆధారంగా జడ్‌ఇటి ఓ నివేదిక రూపొందించింది. ముఖ్యంగా టైర్‌ 2, 3, 4 నగరాల్లో రూపే క్రెడిట్‌ కార్డుల వాడకం పెరిగిపోయింది. అంతర్జాతీయ పేమెంట్‌ నెట్‌వర్క్‌లైన మాస్టర్‌, వీసా కార్డుల కంటే రూపే క్రెడిట్‌ కార్డులనే వినియోగదారులు ఎక్కువ కోరుకుంటున్నారు. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో తమ వేదికగా రూపే క్రెడిట్‌ కార్డులకు 37 శాతం డిమాండ్‌ వచ్చిందని తెలిపింది. ఇదే త్రైమాసికంలో మాస్టర్‌ కార్డు క్రెడిట్‌ కార్డులకు 32 శాతం, వీసా కార్డులకు 31 శాతం మాత్రమే డిమాండ్‌ వచ్చిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ మనీష్‌ ష్రా తెలిపారు.