- ఖరీఫ్‌లో కొత్త ప్రాంతాలకు విస్తరణ
- సీమలో వేరుశనగకు ప్రత్యామ్నాయం
- పంటల సరళిలో కొత్త ధోరణి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ మారు పత్తి సాగు వైపునకు రైతులు పెద్ద ఎత్తున మొగ్గారు. దాంతో ఆ పంట సాగు గడచిన రెండేళ్ల కంటే పెరిగింది. ఖరీఫ్‌లోనే పత్తి సాగవుతుంది. రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 15.25 లక్షల ఎకరాలు కాగా సెప్టెంబర్ నెలాఖరుకు 16.32 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. నార్మల్ కంటే ఏడు శాతం విస్తీర్ణం పెరిగింది. ప్రభుత్వం 15.37 లక్షల హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యాన్ని నిర్ణయించింది. వరి సహా ఆహార పంటలు టార్గెట్ కాదు కదా నార్మల్ కంటే తక్కువ సాగుకాగా, వ్యాపార పంట పత్తి మాత్రం నార్మల్‌నే కాకుండా టార్గెట్‌ను సైతం మించిపోయింది. సాధారణంగా ఏడాదికేడాదీ పత్తి సాగును తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం మసకబారింది. సర్కారు తీసుకున్న టార్గెట్ కంటే 95 వేల ఎకరాల్లో సాగు పెరిగింది. నార్మల్ కంటే 1.07 లక్షల ఎకరాల్లో ఎక్కువైంది. ముందటేడు కంటే 1.82 లక్షల ఎకరాల్లో పెరగ్గా, నిరుటి కంటే 3.82 లక్షల ఎకరాల్లో పెరిగింది.
రాయలసీమకు విస్తరణ
పత్తి సాగులో కొత్త ధోరణి కనిపిస్తోంది. సంప్రదాయకంగా ఎప్పటి నుంచో పత్తిని సాగు చేస్తున్న ప్రాంతాల్లో సాగు తగ్గగా, అసలా పంటే కొన్నాళ్ల క్రితంవరకు కించిత్తు పరిచయం లేని ప్రాంతా లకు విస్తరిస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ తడవ పత్తి అసాధారణంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నార్మల్ కంటే ఏడు శాతం పెరగ్గా, రాయలసీమ జిల్లాల్లో వంద రెండొందల శాతం పెరిగింది. నార్మల్ కంటే కర్నూలు జిల్లాలో ఏడు శాతం సాగు పెరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో ఏకంగా 151 శాతం పత్తి సాగు ఎక్కువైంది. అనంతపురంలో 53 శాతం, నంద్యాలలో 37 శాతం పెరిగింది. ప్రకాశంలో 40 శాతం విస్తీర్ణంలో అధికమైంది. కొన్నేళ్లుగా పత్తిని సాగు చేస్తున్న పల్నాడులో ఈసారి 84 శాతమే పడింది. గుంటూరులో 80 శాతం సాగైంది. ఎన్టిఆర్ జిల్లాలో 85 శాతం సాగైంది. మన్యం జిల్లాలో 72 శాతమే సాగైంది. కాగా రాయలసీమలో ఆనవాయితీగా వేరుశనగ, ఇతర నూనెగింజలను సాగు చేస్తారు. కొన్నేళ్లుగా వేరుశనగ సాగులో నష్టాలు రావడంతో ఆ పంట సాగుపై రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. వేరుశనగకు ప్రత్నామ్నాయం కోసం వెతుకుతున్నారు. మూడేళ్ల నుంచి సీమలో వర్షాలు దండిగా కురుస్తుండటంతో వేరుశనగ స్థానంలో పత్తిని ఎంచుకున్నారు.
గతేడాది నష్టాలే
గతేడాది విపత్తుల వలన పత్తి సాగు బాగా తగ్గింది. సాగైన పంట సైతం భారీ వర్షాలు, వరదలు, వర్షాభావం, డ్రై-స్పెల్స్‌కు దెబ్బతింది. ఆ మేరకు రైతులకు దిగుబడి నష్టం వచ్చింది. ఎకరానికి కనీసం 10-12 లక్షల క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా, నిరుడు సగటున లభించిన దిగుబడి కేవలం 4-5 క్వింటాళ్లు. దిగుబడి తగ్గడంతో మార్కెట్లో పత్తికి ధర వచ్చింది. దాంతో రైతులు ఈ తడవ పత్తి సాగు వైపు మళ్లారు. అనధికారికంగా బిటి-3 పత్తి విత్తనాలను విక్రయించారు. చాలా చోట్ల నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాల విక్రయాలు జోరుగా సాగాయి. నిరుడు ఈ సమస్యకు తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన రైతులు నష్టపోయారు. ఈ తడవ నష్టాలు పూడతాయని ఆశతో ఉన్నారు.











